ఏడాదిని పరాజయంతో ముగించిన టీమిండియా ఇప్పుడు కొత్త సంవత్సరాన్ని విజయంతో ఆరంభించాలని భావిస్తోంది. సఫారీ గడ్డపై టెస్ట్ సీరీస్ గెలవాలన్న లక్ష్యం ఈసారి కూడా నెరవేరకపోగా… ఇప్పుడు సీరీస్ సమం చేయాలని పట్టుదలగా ఉంది. కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు కోసం భారత జట్టు తీవ్రంగానే శ్రమిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు కేప్‌టౌన్‌లోని రికార్డులు భారత జట్టును భయపెడుతున్నాయి. కేప్‌టౌన్‌లోని న్యూల్యాండ్స్ క్రికెట్ స్టేడియంలో టీమిండియా టెస్టు రికార్డు మరి దారుణంగా ఉంది. ఇప్పటివరకు కేప్‌టౌన్‌లో ఆరు టెస్టులు ఆడిన భారత్.. ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించలేదు. 4 మ్యాచ్‌లలో ఓటమి పాలవ్వగా.. రెండింటిని డ్రా ముగించింది. ఈ వేదికలో 1993లో భారత్ తొలి టెస్టు మ్యాచ్ ఆడింది.
ఈ స్టేడియంలో టీమిండియా అత్యధిక స్కోర్ 414 పరుగులగా ఉంది. 2007లో జరిగిన మ్యాచ్ లో ఈ భారీ స్కోరు చేసింది. అలాగే అత్యల్ప స్కోర్ 135 రన్స్ గా ఉంది. 2018లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 135 పరుగులకే ఆలౌటైంది. ఇక న్యూలాండ్స్ స్టేడియంలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. ఈ వేదికలో నాలుగు టెస్టులు ఆడిన సచిన్ 489 పరుగులు చేశాడు.
ఇక అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా మాజీ పేసర్ జవగల్ శ్రీనాథ్ ఉన్నాడు. తొలి టెస్టులో భారత్ పూర్తిగా తేలిపోయింది. అంచనాలు పెట్టుకున్న బ్యాటర్లు విఫలమయ్యారు. కోహ్లీ , రాహుల్ తప్పిస్తే మిగిలిన వారంతా చేతులెత్తేయడంతో ఇన్నింగ్స్ ఓటమి తప్పలేదు. దీనికి తోడు సఫారీ పేసర్లు రాణించిన పిచ్ పై మన బౌలర్లు నిరాశ పరిచారు. ఈ నేపథ్యంలో సీరీస్ చేజారకుండా ఉండాలంటే రెండో టెస్టులో భారత్ అంచనాలకు మించి రాణించాల్సి ఉంటుంది.