టీ ట్వంటీ (T20) వరల్డ్ కప్ (World Cup) లో టీమ్స్ ఎడాపెడా దంచేసినా పర్లేదు. కానీ బౌలింగ్ సమయంలో మాత్రం జాగ్రత్త పడాలి. ఓవర్‌కు ఓవర్‌కు మధ్య నిక్కచ్చిగా 60 సెకన్ల సమయాన్ని మాత్రమే తీసుకోవాలి. నింపాదిగా బౌలింగ్ చేస్తానంటే ఇకపై అస్సలు కుదరదు. ఐసీసీ స్టాప్ క్లాక్ నిబంధనను ఈ ఏడాది జూన్‌లో జరిగే టి20 ప్రపంచకప్ నుంచి అమలు చేయాలని నిర్ణయించింది.
రెండు ఓవర్ల మధ్య విరామ సమయాన్ని తగ్గించడమే స్టాప్ క్లాక్ రూల్. ఒక బౌలర్ ఓవర్ ముగించిన వెంటనే మరో బౌలర్ 60 సెకన్లలోపే బౌలింగ్ చేయాలి. అలా వేయకపోతే అంపైర్లు మూడుసార్లు హెచ్చరికలతో సరిపెడతారు. ఆ తర్వాత కూడా పునరావృతమైతే పెనాల్టీ విధిస్తారు. స్టాప్ క్లాక్ రూల్‌తో వన్డేల్లో దాదాపు 20 నిమిషాల సమయం ఆదా అవుతున్నట్లు ఐసీసీ పేర్కొంది. ఇక టి20 ప్రపంచకప్‌లో నాకౌట్ దశ మ్యాచ్‌లన్నింటికీ రిజర్వ్ డేలను ఖరారు చేసింది.