ఆసీస్ గడ్డ కోహ్లీ అడ్డా, విరాట్ ని ఊరిస్తున్న రికార్డులివే

ప్రపంచ క్రికెట్ లో రన్ మెషీన్ విరాట్ కోహ్లీ గత కొంతకాలంగా వెనుకబడ్డాడు. రికార్డుల రారాజుగా నిలిచిన విరాట్ బ్యాట్ తో గర్జించి కొన్ని నెలలు దాటిపోతోంది. ఇప్పుడు ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కోహ్లీపై భారీ అంచనాలే ఉన్నాయి.

  • Written By:
  • Publish Date - November 18, 2024 / 06:09 PM IST

ప్రపంచ క్రికెట్ లో రన్ మెషీన్ విరాట్ కోహ్లీ గత కొంతకాలంగా వెనుకబడ్డాడు. రికార్డుల రారాజుగా నిలిచిన విరాట్ బ్యాట్ తో గర్జించి కొన్ని నెలలు దాటిపోతోంది. ఇప్పుడు ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కోహ్లీపై భారీ అంచనాలే ఉన్నాయి. సాధారణంగానే కంగారూలపై అంటే కోహ్లీకి పూనకం వస్తుంది. అసలే ఇప్పుడు ఫామ్ లో లేకపోవడం, తన సత్తా నిరూపించుకోవాల్సిన పరిస్థితి రావడంతో విరాట్ చెలరేగుతాడని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. అటు కోహ్లీ కూడా ఆసీస్ తో సిరీస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ప్రాక్టీస్ లో బిజీబిజీగా గడుపుతున్న భారత స్టార్ బ్యాటర్ ను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. ఓవరాల్ గా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అత్యధిక పరుగుల జాబితాలో పుజారా, ద్రవిడ్ లను అధిగమించేందుకు విరాట్ చేరువలో ఉన్నాడు. మరో 33 రన్స్ చేస్తే పుజారా రికార్డును బ్రేక్ చేస్తాడు. పుజారా 2074 పరుగులు చేయగా… కోహ్లీ 2042 పరుగులు చేశాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ 3630 పరుగులతో టాప్ ప్లేస్ లో ఉండగా… వీవీఎస్ లక్ష్మణ్ 2434 రన్స్ తోనూ రెండో స్థానంలోనూ, 2143 రన్స్ తో ద్రవిడ్ మూడో స్థానంలోనూ కొనసాగుతున్నారు.

కాగా విరాట్ ఈ సిరీస్ లో మరో 458 పరుగులు చేస్తే ఆసీస్ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలుస్తాడు. ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లీ ఇప్పటివరకు కోహ్లీ 1352 పరుగులు చేశాడు. 1809 పరుగులతో భారత దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ టాప్ లో ఉన్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై 6 సెంచరీలతో విదేశీ ఆటగాళ్ళలో కోహ్లీ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. కోహ్లీ మరో నాలుగు సెంచరీలు కొడితే ఆసీస్ గడ్డపై అత్యధిక సెంచరీలు చేసిన విదేశీ ప్లేయర్ గా సరికొత్త చరిత్ర సృష్టిస్తాడు. అలాగే ఆసీస్ గడపై కోహ్లీ ఇప్పటివరకు 30 సార్లు 50 పైగా స్కోర్లు చేశాడు. మరో 5 సార్లు 50కి పైగా పరుగులు చేస్తే.. కంగారూల గడ్డపై అత్యధికసార్లు 50 పైకి పైగా పరుగులు చేసిన విదేశీ ఆటగాడిగా విరాట్ రెండో స్థానానికి చేరుతాడు.

మరోవైపు ఆసీస్ గడ్డపై కోహ్లీ ఇప్పటివరకు 3426 పరుగులు చేశాడు. మరో 76 పరుగులు చేస్తే ఆస్ట్రేలియాపై 3500 పరుగులు చేసిన తొలి భారత ఆటగాడిగా నిలుస్తాడు. ఇక అడిలైడ్ గ్రౌండ్ లో కోహ్లీ 5 సెంచరీలు కొట్టాడు. మరో సెంచరీ చేస్తే కంగారూల గడ్డపై ఒకే గ్రౌండ్ లో అత్యధిక సెంచరీలు చేసిన విదేశీ ఆటగాడిగా విరాట్ అగ్ర స్థానానికి చేరతాడు. ఇదిలా ఉంటే కోహ్లీ ఆస్ట్రేలియాపై అన్ని ఫార్మాట్ లలో కలిపి ఇప్పటి వరకూ 97 మ్యాచ్ లు ఆడాడు. సిరీస్ లో తొలి మూడు టెస్ట్ మ్యాచ్ లు అనంతరం ఆస్ట్రేలియాపై 100 మ్యాచ్ లు పూర్తి చేసుకొన్న రెండో ప్లేయర్ గా నిలుస్తాడు. గతంలో సచిన్ మాత్రమే ఆసీస్ పై అత్యధిక మ్యాచ్ లు ఆడిన భారత ఆటగాడిగా ఉన్నాడు. ఇక
కోహ్లీ మరో 5 సిక్సర్లు కొడితే అంతర్జాతీయ క్రికెట్ లో ఆస్ట్రేలియాపై అత్యధిక సిక్సర్లు కొట్టిన రెండో ఆటగాడిగా నిలుస్తాడు.