భారత క్రికెట్‌లో (Indian Cricketer) అన్నదమ్ములు క్రికెటర్లుగా ఉండడం కొత్తేమీ కాదు. తాజాగా మరోసారి ఇద్దరు సోదరులు దుమ్మురేపుతున్నారు. వారే సర్ఫ్‌రాజ్ ఖాన్, ముషీర్ ఖాన్… భారత్ ఎ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సర్ఫ్‌రాజ్ ఖాన్ ఇంగ్లండ్ లయన్స్‌పై పరుగుల వరద పారిస్తున్నాడు. అనధికారిక టెస్టులో సెంచరీతో దుమ్ములేపాడు. వన్డే తరహా ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. 160 బంతుల్లోనే 18 ఫోర్లు, 5 సిక్స్‌లు బాది 161 పరుగులు సాధించాడు. యాధృచ్ఛికంగా ఇదే రోజు సర్ఫ్‌రాజ్ తమ్ముడు ముషీర్ ఖాన్ (Mushir Khan) ఐర్లాండ్‌తో వన్డేలో శతకం సాధించాడు.
ఐసీసీ అండర్-19 (ICC Under 19) క్రికెట్ వరల్డ్‌కప్ (World Cup) లో అదరగొట్టిన ముషీర్ ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో ఆద్యంతం దూకుడుగా ఆడి సెంచరీతో చెలరేగాడు. 106 బంతులు ఎదుర్కొన్న 18 ఏళ్ల ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్ 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 118 పరుగులు సాధించాడు. ఆరంభంలోనే భారత యువ జట్టు వికెట్లు చేజార్చుకున్నా…వన్‌డౌన్ బ్యాటర్ ముషీర్ ఖాన్ మాత్రం పట్టుదలగా నిలబడి.. జట్టుకు మంచి స్కోర్ అందించాడు. ఇదిలా ఉంటే.. ముషీర్ ఖాన్.. ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌కు స్వయానా తమ్ముడు. ఈ నేపథ్యంలో ఈ అన్నాదముళ్లను క్రికెట్ ప్రేమికులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
అన్న అలా.. తమ్ముడేమో ఇలా ఈరోజు సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్‌లదే అంటూ అన్నాదముళ్లను ఆకాశానికెత్తుతున్నారు. త్వరలోనే ఈ ఇద్దరూ టీమిండియాకు ఆడాలని ఆకాంక్షిస్తున్నారు. కాగా సర్ఫ్‌రాజ్ ఖాన్ రంజీల్లో నిలకడగా రాణిస్తున్న సెలక్టర్లు మాత్రం కరుణించడం లేదు. ఈ సీజన్‌లోనూ అతను ఆకట్టుకోగా.. ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు ఎంపికవుతాడని భావించారు. అయితే రజత్ పటిదార్‌ను సెలక్టర్లు ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు ఎంపిక చేశారు.