68 ఏళ్ళ వయసులో క్రికెట్ మ్యాచ్ (Cricket Match) ఆడిన ఆటగాడు ఎవరో మీకు తెలుసా… 50 ఏళ్ళ వయసులో డబుల్ సెంచరీ కొట్టిన ఆ క్రికెటర్ (Cricket) గురించి విన్నారా… 48 ఏళ్ళ సుధీర్ఘ క్రికెట్ కెరీర్ కొనసాగించిన ఆయన గురించి ఇప్పటి తరం క్రికెట్ ఫ్యాన్స్ లో చాలా మందికి తెలియకపోవచ్చు. ఆయన మరెవరో కాదు భారత క్రికెట్ దిగ్గజం కొఠారి కనకయ్య నాయుడు (Kothari Kanakaiah Naidu)… పాతతరం క్రికెటర్లకు, క్రికెట్ అభిమానులకు సీకె నాయుడుగా సుపరిచితుడైన ఈ భారత క్రికెట్ లెజెండ్ గురించి మరిన్ని విశేషాలు మీకోసం…
భారత క్రికెట్ (Indian Cricket) లో సీకే నాయుడు కోహినూర్ డైమండ్ (Kohinoor Diamond) కంటే విలువైన ప్లేయర్ అనడంలో ఏ మాత్రం డౌట్ లేదు. దాదారు రెండు దశాబ్దాల పాటు భారత క్రికెట్ లో నాయుడు యుగంగా చెబుతారంటే అతిశయోక్తి కాదు. సాధారణంగా ఏ ఆటగాడి కెరీర్ అయినా 35 లేదా 40 ఏళ్ళ వయసు లోపు ముగిసిపోతుంది. మహా అయితే రెండు దశాబ్దాల పాటు ఆడొచ్చు.. కానీ సీకె నాయుడు కెరీర్ ను చూస్తే ఇప్పటి తరం ఆటగాళ్ళకు మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే… ఎందుకంటే సీకే నాయుడు తన కెరీర్ లో సగానికి పైగా మ్యాచ్ లు 40 ఏళ్ళు దాటిన తర్వాతే ఆడారు. 1916లో మెుదలైన ఆయన ప్రస్థానం చివరి వరకూ అప్రతిహాతంగా సాగింది. ఆరు దశాబ్దాలపాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన కొద్దిమంది క్రికెటర్లలో సీకే నాయుడు ఒకరు. 1916లో మొదటి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడిన ఆయన 1956-57 రంజీ ట్రోఫీ (Ranji Trophy) లో తన 62వ ఏట చివరి మ్యాచ్ ఆడారు.
సీకే నాయుడు (CK Naidu) పూర్వీకులు కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన వారు. వాళ్ల కుటుంబం మొదట హైదరాబాద్ లో స్థిరపడింది. తర్వాత ఔరంగాబాద్ కు షిప్ట్ అయ్యారు. 60వ ఏట కూడా ఎంతో ఉత్సాహంగా కుర్రాళ్ళతో పోటీ పడుతూ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడడం సీకే నాయుడుకే చెల్లింది. నలభై ఎనిమిదేళ్ళ సుదీర్ఘ ఫస్ట్ క్లాసు కెరీర్ లో సి.కె. ముంబై క్వాడ్రాంగులర్స్, పెంటాంగులర్స్, రంజీట్రోఫీ, మద్రాసు ప్రెసిడెన్సీ మ్యాచ్ లు, మొయినుద్దౌలా గోల్డ్ కప్ ఇలా అనేక టోర్నమెంట్లలో ఆడారు. వీటితో పాటు వివిధ రాష్ట్రాల చీఫ్ మినిస్టర్స్ ఎలెవెన్, గవర్నర్ ఎలెవెన్ జట్లకి కూడా ప్రాతినిధ్యం వహించారు.
సీకే నాయుడు తన ఫస్ట్ క్లాస్ కెరీర్ లో మొత్తం 344 మ్యాచ్ లు ఆడి 11825 పరుగులు చేయడంతో పాటు 411 వికెట్లు తీసుకున్నాడు. భారత టెస్ట్ క్రికెట్ జట్టు (Indian Test Cricket Team) తొలి కెప్టెన్ గా ఘనత అందుకున్న సీకే నాయుడు అంతర్జాతీయ స్థాయిలో 7 మ్యాచ్ లే ఆడారు. అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఇప్పటికీ ఆయనకు మరొకరు సాటి లేరు..రారన్నది అంగీకరించాల్సిందే. 50 ఏళ్ళ వయసులో డబుల్ సెంచరీ కొట్టాలంటే ఎంత స్టామినా ఉండాలి… అలాంటి స్టామినా ఉన్న క్రికెటర్ ఆయన మాత్రమే.. భారత జట్టుకి ఆడినవారిలో విజ్డెన్ పత్రిక క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికైన మొదటి క్రికెటర్ గా రికార్డులకెక్కారు. ఆయన ఆట చూసిన పలువురు ప్రత్యర్థి క్రికెటర్లు సైతం ప్రశంసించకుండా ఉండలేకపోయారు. సీకే నాయుడు లాంటి ప్లేయర్ ను మళ్ళీ చూడలేమని పలువురు దిగ్గజ క్రికెటర్లే చెప్పారంటే ఆయన సత్తా ఏంతో అర్థం చేసుకోవచ్చు.