Aus vs Eng: బ్యాట్‌తోనే బుద్ధి చెప్పింది.. ఆస్ట్రేలియా లోయర్ ఆర్డర్‌ను తక్కువ చేసి మాట్లాడిన వాళ్ల తిక్క కుదిరింది!

చివరి వరకు పోరాడతారు.. అసలు గివ్‌ అప్‌ అనే మాటకు అర్థమే ఉండని జట్టు ఆస్ట్రేలియా. బ్యాటింగ్‌ సరిగ్గా ఆడడం రాకున్నా.. ఆస్ట్రేలియా లోయర్‌ ఆర్డర్‌ మాత్రం తలవంచదు..! ప్రత్యర్థి జట్టు ఇంగ్లండ్‌ అయినా.. ఇండియా అయినా వెనక్కి తగ్గదు. పోరాడి ఓడటమే కానీ.. ఓటమిని ఈజీగా సమర్పించుకోని జట్టు ఆస్ట్రేలియా.

  • Written By:
  • Publish Date - June 21, 2023 / 09:01 AM IST

Aus vs Eng: ఆస్ట్రేలియాను తక్కువ అంచనా వేస్తే ఏం జరుగుతుందో చరిత్ర చెబుతోంది. వన్డే క్రికెటైనా, సంప్రదాయ టెస్టు క్రికెటైనా ఆస్ట్రేలియాకి ఉన్న విన్నింగ్‌ రికార్డులు మరే జట్టుకు లేవు. అలాంటి ఆస్ట్రేలియా ఇటివలి కాలంలో ఓ విషయంలో భారీ విమర్శలను ఎదుర్కొంది. అయితే యాషెస్‌ తొలి టెస్టుతో వాటికి బ్రేకులు పడ్డాయి.
చివరి వరకు పోరాడతారు.. అసలు గివ్‌ అప్‌ అనే మాటకు అర్థమే ఉండని జట్టు ఆస్ట్రేలియా. బ్యాటింగ్‌ సరిగ్గా ఆడడం రాకున్నా.. ఆస్ట్రేలియా లోయర్‌ ఆర్డర్‌ మాత్రం తలవంచదు..! ప్రత్యర్థి జట్టు ఇంగ్లండ్‌ అయినా.. ఇండియా అయినా వెనక్కి తగ్గదు. పోరాడి ఓడటమే కానీ.. ఓటమిని ఈజీగా సమర్పించుకోని జట్టు ఆస్ట్రేలియా. అయితే 2019 తర్వాత ఆస్ట్రేలియా లోయర్‌ ఆర్డర్‌పై అనేక విమర్శలు వచ్చాయి. గతంలో ఆస్ట్రేలియా జట్టు లోయర్‌ ఆర్డర్‌కు ఉండే తెగింపు ప్రస్తుత ఆసీస్‌ లోయర్‌ ఆర్డర్‌కు లేదని గణాంకాలు కూడా చెబుతున్నాయి. ఇది నిజమే..! అయితే ఇలా ఏ విషయంలోనైనా ఆస్ట్రేలియా విమర్శల పాలైతే తర్వాత దాన్ని అధిగమిస్తుంది. చరిత్ర అదే చెబుతోంది. యషెస్‌ తొలి టెస్టు కూడా అదే నిరూపించింది. ఇంగ్లండ్‌పై ఓడిపోయే మ్యాచ్‌ని లోయర్‌ ఆర్డరే గెలిపించింది. విమర్శకులకు బ్యాట్‌తోనే బుద్ధి చెప్పింది.
వారెవ్వా..కమిన్స్
అప్పటికి ఆసీస్ స్కోరు 209-7. విజయానికి మరో 71 పరుగులు కావాలి. ఆస్ట్రేలియా బ్యాటింగ్ తోపు ఉస్మాన్ ఖవాజా అప్పుడే అవుట్ అయ్యాడు. 65పరుగులు చేసిన ఖవాజా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌ స్టోక్స్‌ బంతికి బోల్తా పడ్డాడు. అలెక్స్ కేరీ (50 బంతుల్లో 20, 2 ఫోర్లు)కూడా అవుట్ అవ్వడంతో ఇంగ్లండ్‌ గెలుపు ఖాయమే అనుకున్నారు. అప్పటికీ 227 పరుగులకు 8 వికెట్లు కోల్పోయింది ఆసీస్‌. ఇంకేముంది.. బజ్‌బాల్‌ వర్క్‌ అవుట్ అయ్యిందని.. ఇంగ్లంగ్‌ గెలుపు నల్లేరుపై నడకేనని కామెంటేటర్లు.. ఇటు ఇంగ్లండ్‌ని సపోర్ట్ చేస్తున్న అభిమానులు ఆనందపడ్డారు. చెప్పాలంటే ఆస్ట్రేలియా లోయర్‌ ఆర్డర్‌ గురించి చాలా చీప్‌గా మాట్లాడారు. పాత లెక్కలను చూపించి మరీ ట్రోల్ చేశారు. అయితే 90 నిమిషాల తర్వాత వాళ్ల ఫ్యూజులు ఔట్ అయ్యాయి.
విమర్శలకు బ్యాట్‌తోనే బుద్ధి చెప్పింది ఆస్ట్రేలియా లోయర్ ఆర్డర్‌. ఆసీస్ సారథి కమిన్స్ పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడాడు. క్రీజులో పాతుకుపోయాడు. నాథన్ లియాన్‌తో కలిసి కమిన్స్‌ ఆస్ట్రేలియాను ముందుకు నడిపించాడు. ఇంగ్లండ్‌ బౌలర్లను చికాకుపెట్టారు. బెన్‌ స్టోక్స్‌ పదేపదే బౌలర్లను మార్చినా ఏం ఉపయోగం లేకపోయింది. మంచి బంతులను డిఫెండ్‌ చేయడం లేదా లీవ్‌ చేయడం.. చెత్త బంతులను సింగిల్‌ తియ్యడం లేదా ఫోర్‌ కొట్టడం చేశారు. జో రూట్ వేసిన 83వ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు కొట్టారు. మొత్తానికి గోడలా క్రీజులో పాతుకుపోయారు. 9వ వికెట్‌కు ఏకంగా 54పరుగులు జోడించారు. దీంతో విజయం ఆస్ట్రేలియానే వరించింది. చాలా కాలంగా తమ లోయర్‌ ఆర్డర్‌ ఆట తీరును ప్రశ్నించిన వాళ్ల నోళ్లు మూయించింది. ఈ విజయం ఆస్ట్రేలియా లోయర్‌ ఆర్డర్‌లో అంతులేని ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఇప్పుడు ఆస్ట్రేలియాకు ఒకటో స్థానం నుంచి 11 స్థానం వరకు బ్యాటింగ్ చేసే ఆటగాళ్లున్నారు. ఇంగ్లండ్‌ ఒళ్లు దగ్గర పెట్టుకోని ఆడకపోతే సొంతగడ్డపై యాషెస్‌ అస్సామే అవుతుంది. ఇది పక్కా..!