World Cup: వరల్డ్ కప్ కు ముందు కూడా మళ్ళీ అదే తప్పు రిపీట్

అక్టోబర్ నెలలో ఆరంభమయ్యే వన్డే ప్రపంచకప్ కోసం టీమిండియా తన సన్నాహకాలను ఆరంభించింది. వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ అనంతరం నెల రోజుల పాటు ఆటకు దూరంగా ఉన్న భారత్.. వెస్టిండీస్ పర్యటనతో ప్రపంచకప్ సన్నాహకాలను ఆరంభించింది.

  • Written By:
  • Publish Date - July 17, 2023 / 07:30 PM IST

ఈ క్రమంలో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్, 141 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్ లో యశస్వి జైస్వాల్ సెంచరీతో పాటు సీనియర్లు రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ రాణించారు. ఈ మ్యాచ్ లో విజయం సాధించినా టీమిండియా అభిమానులు మాత్రం ఆనందంగా లేరు. వెస్టిండీస్ లాంటి జట్లపై ఎంత భారీ విజయాలు సాధించినా భారత జట్టుకు ఇసుమంత ఉపయోగం కూడా లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రపంచకప్ ముంగిట బలహీనంగా ఉన్న విండీస్, ఐర్లాండ్ లతో సిరీస్ లు ఆడితే ఏం ఉపయోగం అంటూ వారు వ్యాఖ్యానిస్తున్నారు. గతేడాది టి20 ప్రపంచకప్ ముందు వెస్టిండీస్, జింబాబ్వే లాంటి జట్లతో సిరీస్ లను ఆడామని వారు గుర్తు చేస్తున్నారు. ఆ రెండింటిలోనూ విజయాలు సాధించామని.. అయితే ఆసియా కప్ లో మన అసలు సత్తా బయటపడిందంటూ వారు కామెంట్స్ చేస్తున్నారు.

గతేడాది చేసిన తప్పునే ఇప్పుడు కూడా టీమిండియా చేస్తుందని అభిమానులు అంటున్నారు. బలహీన జట్లతో సిరీస్ లను ఆడుతూ టీమిండియా తన గోతిని తానే తవ్వుకుంటుందనేది అభిమానుల వాదన. వారి వాదన కూడా సరైందనే అనిపిస్తుంది. వెస్టిండీస్, ఐర్లాండ్ లపై విజయాలు సాధించడంతో మన వాళ్ల ఆత్మ విశ్వాసం కాస్త అతి విశ్వాసంగా మారుతోంది. గతేడాది కూడా ఇలానే జరిగింది. ఆసియా కప్ ముందు వరకు.. ఆ తర్వాత ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలపై సిరీస్ లను నెగ్గిన భారత్.. ప్రపంచకప్ లో మాత్రం చేతులెత్తేసింది. ఈసారి కూడా అలానే జరుగుతందేమో అని కొందరు అభిమానులు భయపడుతున్నారు. 2013 చాంపియన్స్ ట్రోఫీ తర్వాత టీమిండియా మరో ఐసీసీ ట్రోఫీ నెగ్గలేదు. ప్రతిసారి సెమీస్ లేదా ఫైనల్ చేరడం బోల్తా పడటం జరుగుతూ వస్తోంది. భారత్ వేదికగా ప్రపంచకప్ జరుగుతుండటంతో ఈసారి టీమిండియాపై భారీ అంచనాలు ఉన్నాయి.