ఎమర్జింగ్ ఆసియాకప్ కెప్టెన్ గా తిలకవర్మ

హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ అంతర్జాతీయ స్థాయిలో కెప్టెన్ గా జట్టును నడిపించబోతున్నాడు. ఎమర్జింగ్ ఆసియా కప్ టోర్నీలో భారత్ ఎ జట్టుకు సారథిగా తిలక్ వర్మ ఎంపికయ్యాడు. 15 మందితో కూడిన భారత్-ఏ జట్టులో పలువురు ఐపీఎల్ స్టార్స్ చోటు దక్కించుకున్నారు.

  • Written By:
  • Publish Date - October 14, 2024 / 08:25 PM IST

హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ అంతర్జాతీయ స్థాయిలో కెప్టెన్ గా జట్టును నడిపించబోతున్నాడు. ఎమర్జింగ్ ఆసియా కప్ టోర్నీలో భారత్ ఎ జట్టుకు సారథిగా తిలక్ వర్మ ఎంపికయ్యాడు. 15 మందితో కూడిన భారత్-ఏ జట్టులో పలువురు ఐపీఎల్ స్టార్స్ చోటు దక్కించుకున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ, సీనియర్ ప్లేయర్ రాహుల్ చాహర్ ఎంపికయ్యారు.ఐపీఎల్‌లో మెరిసిన యువ ఆటగాళ్లకు సెలక్టర్లు ప్రాధాన్యతనిచ్చారు. యువ బ్యాటర్లు ఆయుష్ బదోని, రమన్‌దీప్ సింగ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ , నేహాల్ వదేరా , అనుజ్ రావత్ చోటు దక్కించుకున్నారు. బౌలర్లుగా ఆర్ సాయి కిశోర్ , హృతిక్ షోకీన్, రసీక్ సలామ్ , వైభవ్ అరోరా , అకీబ్ ఖాన్ ఎంపికయ్యారు. 2022 అండర్-19 ప్రపంచకప్ విజేత, ఆల్‌రౌండర్ నిశాంత్ సింధుకు కూడా చోటు దక్కింది.

ఆసియా స్థాయిలో అన్ని దేశాల ఏ జట్లు ఎమర్జింగ్ ఆసియా కప్‌లో ఆడతాయి. మొత్తం 8 దేశాలు పోటీపడనున్నాయి. గ్రూప్-ఏలో అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, హాంగ్ కాంగ్, శ్రీలంక , గ్రూప్-బీలో భారత్, ఒమన్, పాకిస్థాన్, యూఏఈ జట్లు ఉన్నాయి. ప్రతి జట్టు ఆయా గ్రూప్‌లోని ఇతర జట్లతో ఒక్కోసారి తలపడనుంది. గ్రూప్‌లలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు చేరుతాయి. అక్టోబర్ 25న సెమీస్, అక్టోబర్ 27న ఫైనల్ జరగనుంది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ ఏ జట్లు అక్టోబర్ 19న తలపడతాయి. కాగా ఈ టోర్నీ చరిత్రలో పాకిస్థాన్, శ్రీలంక ఏ జట్లు రెండేసి సార్లు టైటిల్ గెలవగా… భారత్ 2013లో ఛాంపియన్ గా నిలిచింది. టీ ట్వంటీ ఫార్మాట్ లో జరిగే ఎమర్జింగ్ ఆసియాకప్ కు ఈ సారి ఒమన్ ఆతిథ్యమివ్వనుంది.