ప్రస్తుతం హాలిడే మూడ్ లో ఉన్న టీమిండియాకు వచ్చే నెలాఖరు నుంచి విరామం లేని క్రికెట్ ఆడనుంది. బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లతో వరుస సిరీస్ లు తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ , వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఇలా ఫుల్ బిజీగా గడపనుంది. తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత జరిగే ఇంగ్లాండ్ టూర్ కూడా ఖరారైంది. భారత్ ఇంగ్లండ్ మధ్య జరగనున్న అయిదు టెస్టుల సిరీస్ వచ్చే ఏడాది జూన్ 20న లీడ్స్ వేదికగా ప్రారంభం కానుంది. జులై 31న లండన్ వేదికగా చివరి టెస్టు జరగనుంది. ఇంగ్లండ్ గడ్డపై భారత్ టెస్టు సిరీస్ గెలిచి 17 ఏళ్లు దాటింది. చివరిగా 2007లో టీమిండియా సిరీస్ విజయం సాధించగా… గత ఇంగ్లండ్ పర్యటనలో అయిదు టెస్టుల సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఒకదశలో 2-1తో ఆధిక్యంలో ఉన్నప్పటకీ చివరి మ్యాచ్ ఓడిపోవడం సిరీస్ విజయం చేజారింది.
ఇదిలా ఉంటే వచ్చే నెల నుంచి 2025 ఆగస్టు వరకు భారత్ మొత్తంగా 15 టెస్టులు ఆడనుంది. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులు, న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది. అనంతరం ఈ ఏడాది నవంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనలో, వచ్చే ఏడాది జూన్‌లో ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా అయిదు టెస్టుల చొప్పున రెండు సిరీస్‌లు ఆడనుంది. ఇంగ్లాండ్ గడ్డపై ఈ సారి టెస్ట్ సిరీస్ గెలిచేందుకు మంచి అవకాశంగా చెప్పొచ్చు. టెస్ట్ ఫార్మాట్ లో పలువురు సీనియర్లు మంచి ఫామ్ లో ఉండడమే దీనికి కారణం.