World Cup: వెస్టిండీస్ లేకుండా వన్డే ప్రపంచకప్.. చరిత్రలో తొలిసారి.. విండీస్‌కు ఏమైంది ?

పడిపోవడమే కానీ.. లేవడం తెలియదు అన్నట్లుగా తయారయింది విండీస్‌ క్రికెట్ పరిస్థితి. ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన జట్టు.. క్రికెట్ పుట్టిన ఇంగ్లండ్‌కు కూడా చుక్కలు చూపించి వరుసగా రెండుసార్లు వన్డే ప్రపంచకప్‌ ఎగురేసుకుపోయిన జట్టు.. టాప్ టెన్ అంటే విండీస్ ప్లేయర్లే ఐదుగురు ఉంటారు అని అభిమానులు కూడా ఫిక్స్ అయిన జట్టు.. అలాంటి టీమ్ లేకుండా 2023 వరల్డ్‌కప్‌ జరగబోతోంది.

  • Written By:
  • Publish Date - July 2, 2023 / 01:40 PM IST

చరిత్రలోనే ఇది మొదటిసారి. 2023 వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా స్కాట్‍లాండ్‍తో జరిగిన మ్యాచ్‍లో వెస్టిండీస్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో టోర్నీకి అర్హత సాధించడంలో విఫలమైంది. 48 ఏళ్ల వన్డే ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి వెస్టిండీస్ అర్హత సాధించలేదు. 1975, 1979లో ప్రపంచకప్ విజేతగా నిలిచిన వెస్టిండీస్.. ఇప్పుడు కనీసం టోర్నీకి అర్హత కూడా సాధించలేకపోయింది. 1970ల్లో ఓ వెలుగు వెలిగిన వెస్టిండీస్ క్రికెట్ టీమ్‌.. కొన్నేళ్లుగా పేలవ ప్రదర్శన చేస్తోంది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించలేకపోయిన కరేబియన్ జట్టు.. 2018లో స్కాట్లాండ్ చేసిన తప్పిదంతో లక్కీగా వరల్డ్ కప్‌కు క్వాలిఫై అయింది. 2022 టీ20 వరల్డ్ కప్‌‌లో సూపర్ 12కు చేరుకోలేకపోయింది.

ఇప్పుడు వన్డే వరల్డ్ కప్‌కి కూడా అర్హత సాధించలేకపోయింది. ఇప్పుడు అయ్యో అంటున్నా.. నిజానికి విండీస్ జట్టు పతనానికి 90ల్లోనే పడింది. రిచర్డ్స్‌ జనరేషన్ ఆటగాళ్లు.. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాక ఆ లోటును విండీస్‌ భర్తీ చేసుకోలేకపోయింది. సిరీస్‌ల నుంచి వరల్డ్‌కప్‌ల వరకు ప్రతీ టోర్నీలో విండీస్‌ నిలకడ తప్పింది. ఐతే వెస్టిండీస్ జట్టులో
టాలెంటెడ్ ప్లేయర్లకు ఎప్పుడూ ఢోకా లేదు. భీకర బ్యాట్స్‌మెన్ ఎవరు అంటే.. చెప్పే నాలుగు పేర్లలతో విండీస్‌ ఆటగాళ్లే ఇద్దరు ఉంటారు అనడంలో ఎలాంటి అనుమానం లేదు. గేల్‌, బ్రావో, పొలార్డ్‌… ఇలా ఎంతో మంది ప్రపంచ స్థాయి క్రికెటర్లు కరీబియన్‌ దీవుల నుంచి వచ్చారు.

విండీస్‌ను ప్రమాదకర జట్టుగానే చూసేవాళ్లు ఎప్పుడూ ! ఐతే జీతాలు, కాంట్రాక్టుల విషయంలో ఆ దేశ క్రికెట్‌ బోర్డుతో.. ఆటగాళ్ల గొడవ విండీస్‌ క్రికెట్‌ పునాదులు కదిలిపోయేలా చేసింది. ఏళ్ల తరబడి సాగిన ఈ గొడవ.. ఎంతకీ పరిష్కారం కాకపోవడంతో ఆటగాళ్లు దేశానికి ఆడటాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం మానేశారు. చాలా మంది కాంట్రాక్టులు వదులుకున్నారు. టీ20 క్రికెట్‌కు ఆదరణ పెరిగి ప్రపంచవ్యాప్తంగా లీగ్‌లు రావడంతో వారికి ప్రత్యామ్నాయాలు పెరిగిపోయాయి. దీంతో దేశానికి ఆడడం వదిలేసి.. ఫ్రాంచైజీల కోసం ఆడడం మొదలుపెట్టారు. దేశం కోసం ఆడడం వదిలేసిన ఆటగాళ్లు.. తమ కోసం ఆడడం మొదలుపెట్టారు. అక్కడ మొదలైన పతనం.. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడీ పరిస్థితికి కారణం అయింది. ఏమైనా విండీస్ లేకుండా వరల్డ్‌కప్ అంటే.. అనుకోవడానికే కాదు.. చూడ్డానికి కూడా అదోలా ఉంటుంది బాస్.