ఐపీఎల్ మెగావేలం కోల్ కతా రిటెన్షన్ లిస్ట్ ఇదే

ఐపీఎల్ 2025 సీజన్ కు ముందు ఆటగాళ్ళ మెగా వేలం జరగబోతోంది. వచ్చే సీజన్ నుంచి ప్రతీ జట్టు కూర్పు మారిపోనున్న నేపథ్యంలో రిటెన్షన్ చేసుకోబోయే ఆటగాళ్ళ జాబితాపై కసరత్తు జరుగుతోంది. ఆయా ఫ్రాంచైజీలు ఈ సారి రిటెన్షన్ ప్లేయర్స్ పై వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - August 17, 2024 / 05:46 PM IST

ఐపీఎల్ 2025 సీజన్ కు ముందు ఆటగాళ్ళ మెగా వేలం జరగబోతోంది. వచ్చే సీజన్ నుంచి ప్రతీ జట్టు కూర్పు మారిపోనున్న నేపథ్యంలో రిటెన్షన్ చేసుకోబోయే ఆటగాళ్ళ జాబితాపై కసరత్తు జరుగుతోంది. ఆయా ఫ్రాంచైజీలు ఈ సారి రిటెన్షన్ ప్లేయర్స్ పై వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. దీనిలో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్ ముగ్గురు కీలక ఆటగాళ్ళను వేలానికి ముందే రిటైన్ చేసుకోనుంది. ఈ ఏడాది సీజన్ లో కోల్ కతాను ఛాంపియన్ గా నిలిపిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ను ఆ ఫ్రాంచైజీ కొనసాగించడం ఖాయం. ఎందుకంటే దూకుడైన నిర్ణయాలు తీసుకుంటూ మైదానంలో జట్టును శ్రేయాస్ అద్భుతంగా నడిపించాడు. సారథిగానే కాకుండా వ్యక్తిగతంగా బ్యాటింగ్ లోనూ రాణించాడు. 17వ సీజన్ శ్రేయాస్ అయ్యర్ 15 మ్యాచ్ లు ఆడి 351 పరుగులు చేశాడు. గతంలో 12.25 కోట్లకు అయ్యర్ ను కొనుగోలు చేసిన కోల్ కతా అతన్ని వేలంలోకి వదిలే అవకాశాలు లేవనే చెప్పాలి.

అలాగే విండీస్ ఆల్ రౌండర్ ఆండ్రూ రస్సెల్ లేకుండా కోల్ కతా జట్టును ఊహించలేం. చాలా సీజన్లుగా నైట్ రైడర్స్ టీమ్ లో కీలక ఆటగాడిగా రస్సెల్ కొనసాగుతున్నాడు. టీ ట్వంటీ ఫార్మాట్ లో తిరుగులేని మ్యాచ్ విన్నర్ గా ఈ విండీస్ ప్లేయర్ కు రికార్డుంది. ఎన్నోసార్లు వంటి చేత్తో కోల్ కత్తాను గెలిపించాడు. ఈ ఏడాది కోల్ కతా ఛాంపియన్ గా నిలవడంలోనూ రస్సెల్ దే కీ రోల్. బ్యాట్ తో 222 పరుగులు చేసిన రస్సెల్ బంతితోనూ అదరగొట్టి 19 వికెట్లు తీశాడు. దీంతో రస్సెల్ కోల్ కతా ఖచ్చితంగా రిటైన్ చేసుకుంటుంది.

ఇక కేకేఆర్ ఖచ్చితంగా తమతో పాటు కొనసాగించుకునే ఆటగాడు యువ సంచలనం రింకూ సింగ్… 2023 సీజన్ లో దుమ్మురేపిన రింకూసింగ్ ఈ ఏడాది కూడా రాణించాడు. అలాగే అంతర్జాతీయ జట్టులోకి ఎంపికై టీ ట్వంటీల్లో తనదైన ముద్ర వేస్తున్నాడు. 2024 సీజన్ లో అనుకున్న అవకాశాలు రాకున్నా రింకూసింగ్ ను కోల్ కతా రిటైన్ చేసుకోవడం ఖాయం. ఎందుకంటే ఇటీవల లంకతో టీ ట్వంటీ సిరీస్ లో బంతితోనూ అతను మ్యాజిక్ చేశాడు. ఈ నేపథ్యంలో ఆల్ రౌండర్ స్కిల్స్ కొంచెం మెరుగైతే రింకూకు తిరుగుండదు. మొత్తం మీద శ్రేయాస్ అయ్యర్, రస్సెల్, రింకూ సింగ్ లకు కోల్ కత్తా రిటెన్షన్ జాబితాలో మొదటి ప్రాధాన్యత ఉంటుందని చెప్పొచ్చు.