టీ ట్వంటీ ఫార్మాట్ అంటేనే అభిమానులకు క్రికెట్ విందు…చివరి బంతి వరకూ ఉత్కంఠగా సాగుతూ ఉర్రూతలూగిస్తాయి. ఇక మ్యాచ్ టై అయితే సూపర్ ఓవర్ తో వచ్చే కిక్కే వేరు… మరి ఒకే మ్యాచ్ 3 సూపర్ ఓవర్లు జరిగితే ఫ్యాన్స్ కు ఇంతకంటే మజా ఉంటుందా… దేశవాళీ టోర్నీ మహారాజా క్రికెట్ టోర్నీలో అభఇమానులు ఇలాంటి మజానే ఆస్వాదించారు. బెంగళూరు బ్లాస్టర్స్, హూబ్లీ టైగర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో మూడు సూపర్ ఓవర్లు నిర్వహించారు. మ్యాచ్‌తో పాటు ఆ తర్వాత జరిగిన రెండు సూపర్ ఓవర్లు టై అయ్యాయి. మూడో సూపర్ ఓవర్‌లో బెంగళూరు బ్లాస్టర్స్‌పై హూబ్లీ టైగర్స్ గెలిచింది.
మొదట ఇరు జట్లూ 164 పరుగులే చేయడంతో సూపర్ ఓవర్‌ను నిర్వహించారు. దీనిలో హూబ్లీ టైగర్స్ పది పరుగులు చేయగా.. బెంగళూరు బ్లాస్టర్స్ కూడా సూపర్ ఓవర్‌లో పది పరుగులే చేసింది. ఆ తర్వాత రెండో సూపర్ ఓవర్‌లో రెండు జట్లూ తలో ఎనిమిది పరుగులు చేయడంతో మ్యాచ్ మూడో సూపర్ ఓవర్‌కు దారి తీసింది. మూడో సూపర్ ఓవర్‌లో బెంగళూరు బ్లాస్టర్స్ 12 పరుగులు చేసింది. హూబ్లీ టైగర్స్ 13 పరుగులు చేసి మూడో సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది. ఒకే మ్యాచ్‌లో మూడు సూపర్ ఓవర్లు నిర్వహించడం క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి. అరుదైన రికార్డుతో హూబ్లీ టైగర్స్, బెంగళూరు బ్లాస్టర్స్ మ్యాచ్ చరిత్రలో నిలిచిపోయింది.