Tilak Varma: మరో యువరాజ్ అనొచ్చా..? తిలక్ వర్మపై ఫ్యాన్స్ చర్చ

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో బరిలోకి దిగిన తిలక్ వర్మ ఆకట్టుకున్నాడు. భారత్‌కు సమస్యగా ఉన్న నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతడు మంచి ప్రదర్శన చేశాడు. కేవలం 22 బంతుల్లోనే 39 పరుగులు చేశాడు. ఇందులో 2 ఫోర్లు, 3 సిక్సర్లు ఉండటం విశేషం.

  • Written By:
  • Publish Date - August 4, 2023 / 04:17 PM IST

Tilak Varma: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ ఓడినా.. ఒక కుర్రాడు అందరి దృష్టి తనపై పడేలా చేసుకున్నాడు. డెబ్యూ మ్యాచ్‌లో అదిరిపోయే ప్రదర్శన చేశాడు. అయితే ఇతర బ్యాటర్లు కీలక సమయంలో చేతులెత్తేయడంతో భారత్ ఓటమి పక్షాన నిలిచింది. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ తిలక్ వర్మ గురించే ఇదంతా. హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ టీమిండియా తరఫున టి20ల్లో అరంగేట్రం చేశాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో బరిలోకి దిగిన అతడు ఆకట్టుకున్నాడు.

భారత్‌కు సమస్యగా ఉన్న నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతడు మంచి ప్రదర్శన చేశాడు. కేవలం 22 బంతుల్లోనే 39 పరుగులు చేశాడు. ఇందులో 2 ఫోర్లు, 3 సిక్సర్లు ఉండటం విశేషం. ఈ క్రమంలో నాలుగో స్థానంలో ఆడేందుకు తాను సిద్ధమే అనే సందేశాన్ని బీసీసీఐ సెలెక్టర్లకు.. టీమ్ మేనేజ్ మెంట్‌కు పంపాడు. అయితే ఒక్క ఇన్నింగ్స్ ఆడగానే ప్లేయర్‌ను ఆకాశానికి ఎత్తేయడం అనేది కూడా సమంజసం కాదు అని కొందరి క్రీడా విశ్లేషకుల వాదన. అండర్ 19 దశ నుంచే తిలక్ వర్మ చాలా ప్రత్యేకం అని, అతడి ఆటను చూసిన వారు అంటుంటారు. మంచి ఫుట్ వర్క్.. బ్యాట్ స్వింగ్ తిలక్ వర్మ సొంతం. షాట్‌ను టైమ్ చేస్తే చాలు గ్రౌండ్ ఎంత పెద్దదైనా సిక్సర్ వెళ్లాల్సిందే. గతంలో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ యువరాజ్ సింగ్ టీమిండియాకు చాలా విజయాలనే అందించాడు.

2007 టి20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌లలో భారత్ ను విజేతగా నిలపడంలో ముఖ్య పాత్ర పోషించాడు. ఇప్పుడు తిలక్ వర్మ రూపంలో టీమిండియాకు మరో యువరాజ్ సింగ్ దొరికాడనే చెప్పాలి. అతడిలో ఆత్మవిశ్వాసం కలిగే అవకాశాలు ఇవ్వాలి. తిలక్ వర్మలో ఉన్న మరో క్వాలిటీ.. పరిస్థితికి తగ్గట్లు బ్యాటింగ్ చేయడం. బ్యాటింగ్ ఆర్డర్‌లో వన్ డౌన్ నుంచి నెంబర్ 7 వరకు ఆడగల సత్తా అతడి సొంతం. స్పిన్‌ను అద్భుతంగా ఆడతాడు. ఇలాంటి ప్లేయర్లు దొరకడం చాలా అరుదు.