మన దేశంలో క్రికెట్ అంటే ఒక మతం, క్రికెటర్లను ఫ్యాన్స్ దేవుళ్ళులా ట్రీట్ చేస్తారు.. వారికి ఉన్న ఫాలోయింగ్ మరే సెలబ్రిటీకి ఉండదు… ఒక్కసారి స్టార్ క్రికెటర్ అయ్యాడంటే ఇక వచ్చే క్రేజే వేరు… అన్నింటికీ మించి ఆయా ఆటగాళ్ళతో ఒప్పందాల కోసం టాప్ కంపెనీలు క్యూ కడుతుంటాయి. ప్రస్తుతం మోస్ట్ బ్రాండ్ వాల్యూ ఉన్న ఆటగాళ్ళ జాబితాను చూస్తే కింగ్ కోహ్లీ టాప్ ప్లేస్ కొనసాగుతున్నాడు. రికార్డుల రారాజుగా పేరున్న కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రన్ మెషీన్ గా ఫార్మాట్ గా సంబంధం లేకుండా పరుగుల వరద పారించే విరాట్ ఎన్నో రికార్డులు సాధించాడు. గ్రౌండ్ లోనే కాదు ఆఫ్ ది ఫీల్డ్ లోనూ పలు అంశాల్లో టాప్ గా నిలిచాడు. తాజాగా కోహ్లీ బ్రాండ్ వాల్యూ 2 వేల కోట్లుగా ఉంది. మ్యాచ్ ఫీజు. ఐపీఎల్ కాంట్రాక్ట్ , ఎండోర్స్ మెంట్స్ , ఫ్యాన్ బేస్ ను ఆధారంగా చేసుకుని ఈ అంచనా వేశారు.
కోహ్లీ తర్వాత అత్యధిక బ్రాండ్ వాల్యూ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీదే… రిటైర్మెంట్ తర్వాత ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నప్పటకీ ధోనీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ పలు టాప్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం ధోనీ బ్రాండ్ వాల్యూ 800 కోట్లపైనే ఉంది. ఇక భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. టెండూల్కర్ ఆటకు గుడ్ బై చెప్పి దశాబ్ద కాలం దాటిపోయినా అతని క్రేజ్ అలానే ఉంది. ప్రస్తుతం పలు టాప్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సచిన్ బ్రాండ్ వాల్యూ కూడా 800 కోట్ల వరకూ ఉంది. ఇక టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ నాలుగో స్థానంలో ఉన్నాడు. భారత సారథిగానే కాకుండా ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా రికార్డులకెక్కిన హిట్ మ్యాన్ కు కూడా
మంచి ఫాలోయింగ్ ఉంది. చాలా కార్పొరేట్ బ్రాండ్స్ కు ప్రచారకర్తగా ఉన్న రోహిత్ బ్రాండ్ వాల్యూ 350 కోట్ల వరకూ ఉంది. ఇక టీమిండియా ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా ఐదో స్థానంలో నిలిచాడు. ఫ్యాషన్ ను బాగా ఫాలో అయ్యే హార్థిక్ ను యూత్ ను ఎట్రాక్ట్ చేసేందుకు పలు కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయి. ప్రస్తుతం పాండ్యా బ్రాండ్ వాల్యూ 250 కోట్ల వరకూ ఉంది. కాగా టాప్ కార్పొరేట్ కంపెనీలన్నీ ఎక్కువగా తమ బ్రాండ్స్ ప్రమోషన్స్ కోసం క్రికెటర్లతోనే ఎండోర్స్ చేసుకుంటున్నాయి.