సాధారణంగా ఒక ఒలింపిక్ మెడల్ (Olympics Medal) గెలవడమే గొప్ప ఘనత.. అలాంటిది ఒకే ఒలింపిక్స్ లో రెండు మెడల్స్ సాధించడమంటే మామూలు విషయం కాదు. అసాధారణ ప్రదర్శనతోనే ఇది సాధ్యమవుతుంది. ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics) లో ఇలాంటి విజయాన్నే యువ షూటర్ మను బాకర్ ఆస్వాదిస్తోంది. అంచనాలతో బరిలోకి దిగిన వ్యక్తిగత విభాగంలో కాంస్యం గెలిచిన మను బాకర్ దేశానికి ఈ ఒలింపిక్స్ లో తొలి మెడల్ అందించింది. ఒక్కరోజు వ్యవధిలోనే మళ్ళీ మిక్సిడ్ టీమ్ ఈవెంట్ లోనూ ఒలింపిక్ మెడల్ గెలిచింది. తద్వారా ఒకే ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించిన ఏకైక భారత క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. అలాగే ఒలింపిక్స్‌లో మొత్తంగా రెండు పతకాలు సాధించిన మూడో భారత అథ్లెట్‌గా రికార్డులకెక్కింది. 124 ఏళ్ల రికార్డ్‌ను మను భాకర్ తిరగరాసింది. 124 ఏళ్ల ఒలింపిక్స్ చరిత్రలో ఇప్పటి వరకు భారత్ నుంచి రెండు పతకాలు సాధించిన అథ్లెట్లు మనుతో కలిపి ముగ్గురు మాత్రమే.
భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ 2008 బీజింగ్ ఒలింపిక్స్, 2012 లండన్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించాడు. 66 కేజీల విభాగంలో పోటీ పడిన సుశీల్ కుమార్ బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం, లండన్ ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ అందుకున్నాడు. అలాగే భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సైతం రెండు మెడల్స్ సాధించి మూడో పతకంపై కన్నేసింది. రియో ఒలింపిక్స్ 2016లో రజతం సాధించిన సింధు.. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించింది. ప్రస్తుత పారిస్ ఒలింపిక్స్ లో మను ఏకంగా రెండు మెడల్స్ సాధించి అరుదైన ఘనతను అందుకుంది.