పారిస్ ఒలింపిక్స్ లో అనర్హత వేటుకు గురైన భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ తన రిటైర్మెంట్ పై వెనక్కి తగ్గినట్టే కనిపిస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఉద్వేగభరిత పోస్ట్‌ను పంచుకోవడమే దీనికి కారణం. తన లక్ష్యం ఇంకా పూర్తి కాలేదని, తన భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తుందని చెప్పుకొచ్చింది. మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఈవెంట్‌లో పోటీ పడిన వినేష్ ఫోగట్ అసాధారణ ప్రదర్శనతో ఫైనల్ చేరింది. తుది పోరుకు ముందు 100 గ్రాముల అధిక బరువు ఉందనే కారణంతో డిస్‌క్వాలిఫై అయ్యింది. డిస్‌క్వాలిఫై అయిన బాధలో వినేష్ ఫోగట్ రిటైర్మెంట్ ప్రకటించింది. అయితే తాజా పోస్ట్‌లో 2032 వరకు ఆడే సత్తా తనకు ఉందని పేర్కొంది. దాంతో వినేష్ ఫోగట్ తన రిటైర్మెంట్ పై యూ టర్న్ తీసుకుందని భావిస్తున్నారు.