‘నువ్వు.. నా కాళ్లకంటిన మట్టితో సమానం..’ ఈ మాట అన్నది ఎవరైనా కావొచ్చు.. వాళ్లకి కోట్లాది అభిమానులూ ఉండి ఉండొచ్చు..అసాధ్యాలను సుసాధ్యాలు చేసిన ఘనత వారిదే ఐఉండొచ్చు.. కానీ ఆ మాటల్లో కనిపిస్తుంది నూటికి నూరు శాతం ఆహంకారమే..! ఎంత ఎత్తుకు ఎదిగిన ఒదిగి ఉండలేని మనస్తత్వం వాళ్లది.. అలాంటి వాళ్ల మన కళ్ల ముందు రోజు కనిపిస్తూనే ఉంటారు.. కొన్ని సార్లు రాజకీయ వేదికలపైనో.. క్రికెట్ గ్రౌండ్‌ల్లోనూ దర్శనమిస్తారు.. ఆ క్షణం..ఆహంకారంతో ఊగిపోతున్న వాళ్లను చూసిన ఆ క్షణం అప్పటివరకు వారిమీద ఉన్న గౌరవం ఆవిరైపోతుంది.. ఎందుకిలా చేశాడబ్బా అనిపిస్తుంది..!
మన దేశంలో క్రికెట్ ఓ మతం.. క్రికెట్‌కున్న క్రేజ్ మరో ఫీల్డ్‌కు లేదు.. క్రికెటర్లను దేవుళ్లతో సమానంగా కొలిచే దేశం మనది.. అందుకే తగ్గట్లే వాళ్లూ ప్రవర్తించాలి.. ముఖ్యంగా కోట్లాది అభిమానులున్న ఆటగాళ్లు వారి ఫేవరెట్ ప్లేయర్లనే అనుసరిస్తుంటారు.. అందుకే క్రికెట్ గ్రౌండ్‌లోనైనా.. బయటైనా కాస్త హూందాగా ఉండాలి! క్రికెట్‌లో నేటి తరానికి గోట్ కోహ్లీనే.. కానీ తాజాగా లక్నోపై మ్యాచ్‌లో కోహ్లీ ప్రవర్తనపై అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. టీమిండియాలోకి కోహ్లీ ఎంట్రీ ఇచ్చి దాదాపు 15ఏళ్లు కావొస్తుంది.. వచ్చిన కొత్తల్లో వివాదాల్లో ఉండడం వేరు.. మంచి పేరు, టీమిండియా చరిత్రలోనే ఎవరికీ లేని కింగ్ హోదా కలిగిన కోహ్లీ గేమ్‌లోకి వచ్చి దశాబ్దంన్నర ఏళ్లు దాటినా ఇప్పటికి చిన్నపిల్లాడినే ప్రవర్తిస్తున్నాడంటున్నారు క్రికెట్ అభిమానులు.. తప్పు ఎవరిదో అన్నది వేరే విషయమని.. స్లెడ్జింగ్ చేయడానికి… ప్రత్యర్థి ఆటగాళ్లపై నోరుపారేసుకోవడానికి చాలా తేడా ఉందంటున్నారు.. రివేంజ్‌లు తీర్చుకోవాడానికి ఇదేం చిన్నపిల్లల ఆట కాదంటున్నారు.. అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నప్పుడు ప్రవర్తన కూడా అనే ఉండాలంటున్నారు..
ఆ విషయంలో సచిన్ దరిదాపుల్లో కూడా కోహ్లీ లేడు:
సచిన్‌తో కోహ్లీని చాలా విషయాల్లో అభిమానులు కంపెర్ చేస్తుంటారు.. అయితే అదంతా బ్యాటింగ్ స్టాట్స్ వరుకే. స్పొరిటివ్‌నెస్ సచిన్ లాంటి ఆటగాళ్లు ప్రపంచంలో చాలా కొద్దీ మందే ఉన్నారు.. అందులో కోహ్లీ లేనే లేడు.. రాడు కూడా.. సచిన్‌ను కేవలం ఆటగాడిగా మాత్రమే ఫ్యాన్స్ భావించలేదు.. క్రికెట్‌ను మతంలా భావించే మన దేశంలో అభిమానులకు సచినే దేవుడు.. ఎందరికో స్ఫూర్తి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మాటకు నిలువెత్తు నిదర్శనం. రికార్డులు దాసోహమైనా.. కోట్లకు పడగలెత్తినా.. చిన్నవయసులోనే ఆకాశమంత పాపులారిటీ వచ్చినా.. అడుగు నేలపైనే అని నమ్మిన అసాధారణ వ్యక్తి. తనకు జట్టులో చోటు దక్కనప్పుడు.. ఆడుతున్నది జూనియర్లు అయినా సరే మైదానంలోకి వెళ్లి డ్రింక్స్ ఇవ్వగల సాదాసీదా వ్యక్తి. 24ఏళ్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన సచిన్ ఎప్పుడూ కూడా ప్రత్యర్థి ఆటగాళ్లనో.. లేక సొంత జట్టు మెంబర్స్‌పైనో గీత దాటి ప్రవర్తించలేదు.. గ్రౌండ్‌మెన్ నుంచి స్వీపర్ల వరకు అందరితో మర్యాదగా ఉండేవాడు.. 2008 చెన్నై టెస్టు విజయం తర్వాత గ్రౌండ్‌లో సచిన్‌కు షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి గ్రౌండ్ స్టాఫ్ పరిగెత్తుకుంటూ వచ్చారు.. వాళ్లని నిరాశ పెట్టకూడదన్న ఆలోచనతో అందిరికి షేక్‌హ్యాండ్స్ ఇచ్చుకుంటూ వెళ్లాడు.. ఇంగ్లండ్ ప్లేయర్లకు ఎలా ఇచ్చాడో అలానే ఇచ్చాడు.. అలాంటి సచిన్‌తో కోహ్లీని కంపెర్ చేయడం వంద శాతం కరెక్ట్ కాదంటున్నారు అభిమానులు. గతంలో కోహ్లీ ఖాతాలో ఉన్న వివాదాలను గుర్తు చేసుకుంటున్నారు..
కోహ్లీ వర్సెస్ కుంబ్లే:
2017లో కుంబ్లే వర్సెస్ కోహ్లీ వివాదం టీమిండియాను కుదిపేసింది.. ఎంతో డిసిప్లిన్ కలిగిన ప్లేయర్‌గా కుంబ్లేపై అందరికి మంచి అభిప్రాయమే ఉంది.. జూన్ 18, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ తర్వాత కుంబ్లే, కోహ్లీ గొడవలు బహిర్గతమయ్యాయి. పాక్‌పై ఆ మ్యాచ్‌లో టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకోవాలని కుంబ్లే సూచించాడట. అయితే కోహ్లీ మాత్రం తాను ముందుగా నిర్ణయించుకున్నట్లు ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కోచ్ కుంబ్లే నిర్ణయాన్ని కాదని కోహ్ తీసుకున్న నిర్ణయం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 180 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. కోచ్‌గా తన పద్ధతులపై కెప్టెన్‌కు అభ్యంతరాలున్నట్లుగా బోర్డు తనకు తెలిపిన కుంబ్లే రాజీనామా చేయాల్సి వచ్చింది..
గంభీర్ వర్సెస్ కోహ్లీ:
టీమిండియాకు 2011 ప్రపంచకప్ రావడంలో కోహ్లీ-గంభీర్ పార్టనెర్‌షిప్ కీ రోల్ ప్లే చేసింది.. సెహ్వాగ్, సచిన్ త్వరగా అవుటవడంతో క్రీజులోకి వచ్చిన కోహ్లీ గంభీర్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు.ఇద్దరు కూడా ఢిల్లీ నుంచి జాతీయ జట్టులోకి వచ్చిన ఆటగాళ్లే.. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ 2013ఐపీఎల్ సీజన్‌లో ఈ ఇద్దరూ కొట్టుకునేంత పని చేశారు.. గ్రౌండ్‌లోనే తన్నుకునేవరకు వెళ్లారు. సహచర ఆటగాళ్లు అడ్డుపడడంతో ఆ కథ అక్కడే ముగిసిందనుకుంటే పొరపాటే.. అవకాశం వచ్చినప్పుడల్లా కోహ్లీపై గంభీర్ విమర్శలు చేయడం ప్రారంభించాడు…కొన్ని సార్లు ఛాన్స్ లేనప్పుడు కూడా కోహ్లీపై తన విద్వేషాన్ని బయటపెట్టాడు. తాజాగా లక్నో వర్సెస్ బెంగళూరు మ్యాచ్ ముగిసిన తర్వాత వీరిద్దరూ ఒకరిమీద మరొకరు నోరు పారేసుకున్నారు. మాటలతో తగువులాడుకున్నారు. ఒకరిపై ఒకరు దూసుకొచ్చారు. చిన్నాస్వామి స్టేడియంలో ఈ సీజన్ ఆరంభంలో జరిగిన మ్యాచ్‌లో గంభీర్ బెంగళూరు అభిమానులను సైలెంట్‌గా ఉండమంటూ సైగలు చేయడంతో కోహ్లీ నిన్నటి మ్యాచ్‌లో స్టార్టింగ్ నుంచే అతి చేసినట్లు క్లియర్‌కట్‌గా కనిపించింది.. అందుకే అఫ్ఘాన్ ప్లేయర్ నవీన్ ఉల్ హక్‌తో వాగ్వాదంతో సమయంలో ‘నువ్వు.. నా కాళ్లకంటిన మట్టితో సమానమంటూ’ ఆహంకారం ప్రదర్శించాడు.
ఇక ఇవే కాదు కోహ్లీ కెరీర్‌లో కాంట్రవర్సీలకు లెక్కే లేదు.. కోహ్లీ వర్సెస్ దాదా.. కోహ్లీ వర్సెస్ రోహిత్.. ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫోలోయింగ్‌లు చేసుకోవడం..ఈ సీజన్ ఐపీఎల్‌లో డగౌట్‌లో కూర్చున్న గంగూలీని కోహ్లీ ఉరిమి ఉరిమి చూడటం.. ఆట ముగిశాక షేక్ హ్యాండ్ ఇవ్వకుండా తప్పించుకోవడం లాంటివి చాలానే ఉన్నాయి.. వీటిని అగ్రెసివ్‌నెస్ అని కోహ్లీ ఫ్యాన్స్ భావిస్తున్నప్పటికీ మిగిలిన వారికి మాత్రం విరాట్ ప్రవర్తన మారాలంటున్నారు.. ఎందుకంటే రివేంజ్ తీర్చుకోవడాలు సాధారణంగా చిన్నతనంలో స్కూల్ పిల్లలు చేసే పనులు.. ఎప్పుడో జరిగిన దాన్ని మైండ్‌లో పెట్టుకొని ఈ స్థాయికి వచ్చిన తర్వాత రివేంజ్‌ల అంటూ ఉన్న గౌరవం పొగొట్టుకోవద్దని.. ఆ ప్రతీకార చర్యలేవో హూందగా కూడా తీర్చుకోవచ్చంటున్నారు..