Virat Kohli: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇరు జట్ల క్రికెటర్లూ ఎప్పుడెప్పుడు మైదానంలోకి దిగుదామా..? అన్నట్లుగా ఉన్నారు. పాకిస్థాన్ బౌలింగ్‌కు, భారత బ్యాటింగ్‌కు మధ్య తీవ్ర పోటీ ఉండటం సహజం. తాజాగా ఆసియా కప్‌లో దాయాదుల పోరుపై టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఎదుర్కొన్న అత్యుత్తమ బౌలింగ్ దళం పాకిస్థాన్‌దేనని పేర్కొన్నాడు.
గత మూడు వన్డేల్లోనూ పాక్‌పై గెలవడం తమకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని తెలిపాడు. ‘‘పాకిస్థాన్ జట్టుకు బౌలింగే బలం. వారి వద్ద అద్భుతమైన బౌలర్లు ఉన్నారు. పేస్ నైపుణ్యంతో మ్యాచ్‌ను ఏ క్షణానైనా మలుపు తిప్పగల సత్తా వారి సొంతం. అందుకే, అలాంటి బౌలర్లను ఎదుర్కోవాలంటే అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించాలి” అని కోహ్లీ అన్నాడు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
ఇప్పటికే నేపాల్‌పై పాకిస్థాన్ ఘన విజయం సాధించి మంచి ఊపు మీదుంది. విరాట్ కోహ్లీ గత డిసెంబర్ నుంచి ఆడిన 13 వన్డేల్లో 50.36 సగటుతో 554 పరుగులు సాధించి ఫామ్‌లో ఉండటం భారత్‌కు కలిసొస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.