Virat Kohli: భారత క్రికెట్‌లో ప్రస్తుతం ధోని తర్వాత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీనే. అతడి ఇమేజ్ అసాధారణం. ప్రపంచంలోనే మేటి ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు పొందిన కోహ్లీ సంపాదనలోనూ ముందున్నాడు. సచిన్, ధోని తర్వాత క్రికెటర్లలో అత్యధిక సంపాదన కలిగిన ఆటగాడిగా మారారు. విరాట్ కోహ్లీ నికర ఆస్తుల విలువ ఎంతో తెలుసా..? దాదాపు రూ.1,000 కోట్లకుపైమాటే. సరిగ్గా చెప్పాలంటే రూ.1050 కోట్లు ఉండొచ్చని స్టాక్ గ్రో అనే కంపెనీ అంచనా వేసింది.
కోహ్లీ స్థాయిలో ఆదాయం సంపాదిస్తున్న క్రికెటర్ అంతర్జాతీయ స్థాయిలో కూడా మరొకరు లేరు. కోహ్లీ కోసమే మ్యాచ్ చూసే ప్రేక్షకులు లక్షల్లో ఉంటారు. లైవ్‌లో అయినా, డిజిటల్, శాటిలైట్ ప్లాట్‌ఫామ్స్‌లో అయినా కోహ్లీ కోసమే మ్యాచ్ చూస్తుంటారు. అతడి కోసమే స్టేడియానికి వస్తారు. అంతటి ఫాలోయింగ్ ఉంది కాబట్టే అతడికోసం వివిధ బ్రాండ్లు పోటీ పడుతుంటాయ. బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, ఐపీఎల్, వ్యాపారాల ద్వారా సగటున ఏడాదికి రూ.175 కోట్లు సంపాదిస్తున్నట్లు అంచనా. ప్రస్తుతం కోహ్లీ ఒక్కో బ్రాండ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించేందుకు ఏడాదికి రూ.7.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. కోహ్లీ ప్రస్తుతం 18కిపైగా బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉన్నాడు. చాలా మంది బాలీవుడ్, స్పోర్ట్స్ స్టార్లతో పోలిస్తే ఈ విషయంలో కోహ్లీ సంపాదనే ఎక్కువగా ఉంది. వివో, మింత్రా, వోలిని, ఎమ్మారెఫ్, సింథాల్, అమెరికన్ టూరిస్టర్ వంటి టాప్ బ్రాండ్లకు ప్రచారం చేస్తున్నాడు.
సొంతంగా కూడా బ్లూట్రైబ్, యూనివర్సల్ స్పోర్ట్స్‌బిజ్, ఎంపీఎల్, వంటి సంస్థల్లో వాటాలున్నాయి. వీటిలో లగ్జరీ క్లోతింగ్, కిడ్స్ లైఫ్‌స్టైల్, రెస్టారెంట్ వ్యాపారాలున్నాయి. ఐపీఎల్‌లో బెంగళూరు జట్టుకు ఆడటం ద్వారా అతడికి ఏడాదికి రూ.15 కోట్లు అందుతున్నాయి. టీమిండియాలో అతడికి బీసీసీఐ ఏ+ కాంట్రాక్ట్ దక్కింది. అంటే ఏడాదికి బీసీసీఐ నుంచే రూ.7 కోట్లు లభిస్తాయి. అలాగే కోహ్లీ ఆడే ప్రతి వన్డే మ్యాచుకు రూ.6 లక్షలు, ప్రతి టెస్టు మ్యాచుకు రూ.15 లక్షలు, టీ20 మ్యాచుకు రూ.3 లక్షలు మ్యాచ్ ఫీజు కింద అందుతాయి. కోహ్లీకి సోషల్ మీడియాలోనూ భారీ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టుకు రూ.8.9 కోట్లు, ట్విట్టర్‌లో ఒక్కో ట్వీట్‌కు రూ.2.5 కోట్ల వరకు వసూలు చేస్తున్నాడు. కొన్ని స్పోర్ట్స్ జట్లను కూడా కోహ్లీ కొనుగోలు చేశాడు. ఎఫ్‌సీ గోవా ఫుట్‌బాల్ క్లబ్, టెన్నిస్, రెజ్లింగ్ జట్లను కలిగి ఉన్నాడు. వీటి ద్వారా కూడా మంచి ఆదాయం దక్కుతోంది. ఇతర ఆస్తులు, లగ్జరీ కార్లు కూడా భారీగానే ఉన్నాయి.
ముంబైలో కోహ్లీ నివాసం ఉంటున్న లగ్జరీ హోమ్ విలువ రూ.34 కోట్లు ఉండగా, స్వస్థలమైన గురుగ్రామ్‌లో రూ.80 కోట్ల విలువైన మరో ఇల్లు కూడా ఉంది. వీటితోపాటు ఆడి, పోర్షె, ఫ్యార్చూనర్, రేంజ్ రోవర్ కార్లున్నాయి. వీటి విలువ రూ.31 కోట్లు ఉంటుందని అంచనా. ఇటీవలి ఐపీఎల్‌తోపాటు తాజాగా జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లోనూ పాల్గొన్న కోహ్లీ.. త్వరలో జరిగే వెస్టిండీస్ సిరీస్‌కు సిద్ధమవుతున్నాడు.