Virender Sehwag: చీఫ్ సెలెక్టర్‌గా సెహ్వాగ్.. టీమిండియా షేప్ షెకల్ మారుతాయా..?

బీసీసీఐ చీఫ్‌ సెలెక్టర్‌ పదవికి భారత మాజీ డాషింగ్‌ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ ముందు వరుసలో ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. బీసీసీఐకి చెందిన ఒక అధికారి స్వయంగా సెహ్వాగ్‌ వద్దకు ప్రతిపాదన తీసుకెళ్లగా.. అందుకు అతడు ఒప్పుకున్నాడట.

  • Written By:
  • Updated On - June 24, 2023 / 01:02 PM IST

Virender Sehwag: మాజీ చీఫ్‌ సెలెక్టర్‌ చేతన్ శర్మ రాజీనామా నేపథ్యలో బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీలో ఒక పదవి ఖాళీగా ఉంది. చీఫ్‌ సెలెక్టర్‌ స్థానాన్ని భర్తీ చేసేందుకు బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. ఇందుకు సంబంధించిన అప్లికేషన్‌ను బీసీసీఐ తన అధికారిక వెబ్‌సైట్‌తో పాటు సోషల్‌ మీడియా ఖాతాలలోనూ ఉంచింది. అప్లికేషన్‌లో జాబ్‌ రోల్‌తో పాటు కావాల్సిన అర్హతలను బీసీసీఐ అందుబాటులో ఉంచింది.

సెలెక్షన్ కమిటీ సభ్యుడు శివ సుందర్ దాస్ తాత్కాలికంగా చీఫ్ సెలెక్టర్ బాధ్యలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. చీఫ్ సెలెక్టర్ స్థానానికి దరఖాస్తు చేసుకునే వ్యక్తికి బీసీసీఐ కొన్ని ప్రమాణాలను నిర్దేశించింది. దరఖాస్తు చేసుకునే వ్యక్తి టీమిండియా తరపున ఏడు టెస్టులు ఆడి ఉండాలి. కనీసం 30 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు అయినా ఆడి ఉండాలి. లేదా 10 వన్డేలు, 20 టి20ల్లో ప్రాతినిధ్యం వహించి ఉండాలి. ఇక అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించి కనీసం ఐదేళ్లు అయి ఉండాలి. భారత జట్టుకు టెస్టు, వన్డే, టీ20లకు టీమ్‌ను ఎంపిక చేయాల్సిన బాధ్యత చీఫ్‌ సెలెక్టర్‌ పదవికి ఎంపికైన వ్యక్తికి ఉంటుంది. బీసీసీఐ చీఫ్‌ సెలెక్టర్‌ పదవికి భారత మాజీ డాషింగ్‌ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ ముందు వరుసలో ఉన్నాడని వార్తలు వస్తున్నాయి.

బీసీసీఐకి చెందిన ఒక అధికారి స్వయంగా సెహ్వాగ్‌ వద్దకు ప్రతిపాదన తీసుకెళ్లగా.. అందుకు అతడు ఒప్పుకున్నాడట. కానీ వీరూ శాలరీ విషయంలో కాస్త నిరాశగా ఉన్నాడట. ఈ నేపథ్యంలోనే సెహ్వాగ్‌ పేరును అధికారికంగా ప్రకటించలేదని తెలుస్తోంది. బీసీసీఐ పెద్దలు సెహ్వాగ్‌ను ఒప్పించే పనిలో ఉన్నారట. సెహ్వాగ్‌ ఎంపిక దాదాపు ఖరారైనట్లేనని సమాచారం. బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌ పదవి కాలం ఐదేళ్లు ఉంటుంది. ఈ పదవిలో ఉన్న వ్యక్తికి ఏడాదికి రూ. కోటి శాలరీగా అందుతుంది. సెలక్షన్‌ కమిటీలోని మిగతా నలుగురు సభ్యులకు రూ.90 లక్షలు ఉంటుంది.

తనకున్న మార్కెట్ దృష్ట్యా ఎండార్స్‌మెంట్లు, కామెంట్రీ రూపంలో ఇంతకంటే ఎక్కువే వీరేంద్ర సెహ్వాగ్‌ సంపాదిస్తారు. అయితే సెహ్వాగ్‌కు దాదాపుగా 5 కోట్లు ఇవ్వడానికి కూడా బీసీసీఐ సిద్ధంగా ఉందట. మరి అధికారిక ప్రకటన వచ్చేవరకు ఏమీ చెప్పలేము.