అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్-2023 నిర్వహణకు షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ మరోసారి తన ప్రెడిక్షన్స్ తో స్పోర్ట్స్ వార్తల్లో నిలిచాడు. ఆతిథ్య టీమిండియాతో పాటు శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, నెదర్లాండ్స్ ఈ ఐసీసీ ఈవెంట్‌లో తలపడనున్నాయి. పది వేదికల్లో నిర్వహించే ప్రపంచకప్ టైటిల్ కోసం పోటీపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే సెమీస్ చేరే జట్లు, విజేతపై పలువురు మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు.
ఈ క్రమంలో వీరేంద్ర సెహ్వాగ్.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వరల్డ్‌కప్-2023లో అత్యధిక పరుగులు సాధిస్తాడని అంచనా వేశాడు. ‘‘ఇండియా పిచ్‌లపై ఓపెనర్లు మంచి స్కోర్లు సాధిస్తారనుకుంటున్నా. ఎవరో ఒకరిని ఎంపిక చేసుకోవాలంటే నేనైతే రోహిత్ శర్మ పేరు చెబుతా. ఇంకో ఇద్దరు ముగ్గురు పేర్లున్నా.. నేను ఇండియన్ కాబట్టే ఇండియన్ పేరే చెప్తాను.. అది మరెవరో కాదు రోహిత్ శర్మనే!’’ అని పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా వైరల్‌గా మారింది. అయితే సెహ్వాగ్ వ్యాఖ్యలపై రోహిత్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తుండగా.. విరాట్ కోహ్లి ఫ్యాన్స్ మాత్రం ఫైర్ అవుతున్నారు. మీరు కింగ్ పేరు కావాలనే మర్చిపోయినట్లున్నారు అని వీరూను ఉద్దేశించి కామెంట్లు పెడుతున్నారు. కాగా ప్రపంచకప్ టోర్నీలో రోహిత్ సేన అక్టోబరు 8న ఆస్ట్రేలియాతో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.