Dhoni: ధోని జడేజా మధ్య ఏం జరిగింది చెన్నై పెద్దమనిషి అసలు విషయం చెప్పేసాడు

గతేడాది నుంచి ఐపీఎల్‌లో జరుగుతున్న ప్రధాన చర్చల్లో ధోనీ, జడేజా గొడవ కూడా ఒకటి. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా 2022 సీజన్ ఆరంభానికి ముందే జడేజాను ప్రకటించారు. కానీ అతని కెప్టెన్సీలో జట్టు చాలా పేలవ ప్రదర్శన చేసింది. దీంతో మళ్లీ కెప్టెన్సీ బాధ్యతను ధోనీ తీసుకోవాల్సి వచ్చింది.

  • Written By:
  • Publish Date - June 22, 2023 / 03:05 PM IST

ఈ క్రమంలో ఈ ఇద్దరి మధ్య గొడవలు మొదలైనట్లు వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో సీఎస్‌కేకు సంబంధించిన ట్వీట్లు, ఇన్‌స్టా పోస్టులను జడ్డూ డిలీట్ చేసేయడం ఈ వదంతులకు మరింత ఆజ్యం పోసింది. ఈ ఏడాది ఐపీఎల్‌లో ధోనీ కన్నా ముందు జడేజా బ్యాటింగ్‌కు వస్తే.. ఫ్యాన్స్ అంతా ‘ధోనీ.. ధోనీ..’ అంటూ నినాదాలు చేశారు. ఈ ఫ్యాన్స్‌ను టార్గెట్ చేసిన జడేజా.. ఒక ట్వీట్ చేశాడు. దీంతో ధోనీ, జడేజా గొడవ మరింత పెద్దదైంది. ఈ విషయంపై సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథ్ స్పందించారు. ‘జడేజా విషయానికొస్తే.. అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడు.

ఇక బ్యాటింగ్‌లో రుతురాజ్, కాన్వే, మొయీన్, రహానే ఉన్నారు. దీంతో జడేజా బ్యాటింగ్‌కు వచ్చే సమయానికి 5-10 బంతులే ఉండేవి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కోసారి క్లిక్ అయితే.. ఒక్కోసారి అనుకున్నట్లు ఆడలేం. తనకు కూడా ఆ తర్వాత ధోనీ రావాలని తెలుసు. కానీ ఒక్కోసారి జడ్డూకే 2-3 బంతులు ఉంటాయి. ఏం చేస్తాడు?’ అని విశ్వనాథ్ ప్రశ్నించాడు. ‘ఇలా జరిగినప్పుడు జడేజా బ్యాటింగ్‌కు వెళ్తే.. ప్రేక్షకులు అందరూ ధోనీ రావాలని డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. దీని వల్ల జడ్డూ ఏమైనా బాధ పడి ఉండొచ్చు. అలాంటి ఒత్తిడి ఏ ఆటగాడికైనా ఉండొచ్చు. కానీ దీని గురించి జడ్డూ ట్వీట్ చేసినా.. ఎప్పుడూ ఎవరితోనూ ఏమీ అనలేదు’ అని విశ్వనాథ్ వెల్లడించాడు.

ధోనీ రావడం కోసం తను త్వరగా అవుట్ అవ్వాలని కొందరు ఫ్యాన్స్ కోరుకుంటున్నారని జడ్డూ ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే.ఇక ఒక మ్యాచ్ అనంతరం జడేజాతో విశ్వనాథ్ చాలా సీరియస్‌గా మాట్లాడుతున్న వీడియో కూడా నెట్టింట వైరల్ అయింది. దీంతో జడేజాతో ధోనీ గొడవ పెద్దదైందని, దీంతో సీ ఎస్ కే యాజమాన్యం రంగంలోకి దిగిందని వార్తలు వచ్చాయి. ‘ఇదంతా ఆటలో సహజమే. ఆ వీడియో చూసిన వాళ్లు.. నేనేదో జడేజాను తిట్టిపారేస్తున్నా అనుకున్నారు. కానీ అలాంటిదేం లేదు. ఆ మ్యాచ్ గురించి, అతను ఆడిన విధానం గురించే మాట్లాడుకున్నాం. ఇంకేం లేదు’ అని విశ్వనాథ్ తెలిపాడు.