India Vs West Indies: 150 కొట్టలేరా..? ఆటలో సీరియస్‌నెస్ లేదు..!

150 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 145 రన్స్ చేసి.. 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. భారత్‌ విజయానికి చివరి ఓవర్‌లో 10 పరుగులు అవసరం కాగా.. రొమారియో షెపర్డ్‌ కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

  • Written By:
  • Publish Date - August 4, 2023 / 12:53 PM IST

India Vs West Indies: ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా గురువారం వెస్టిండీస్‌తో జరిగిన మొదటి మ్యాచులో భారత్ ఓడిపోయింది. 150 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 145 రన్స్ చేసి.. 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. భారత్‌ విజయానికి చివరి ఓవర్‌లో 10 పరుగులు అవసరం కాగా.. రొమారియో షెపర్డ్‌ కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. తొలి మ్యాచ్ ఆడిన హైదరాబాద్ ప్లేయర్ తిలక్‌ వర్మ 22 బంతుల్లో 39 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్ 6 వికెట్లకు 149 రన్స్ చేసింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ హార్దిక్ పాండ్య మాట్లాడుతూ.. యువకులతో కూడిన జట్టు కొన్ని పొరపాట్లు చేసిందని, తప్పకుండా పుంజుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు. ‘ఛేజింగ్‌లో మేం ఓ దశలో మెరుగ్గా ఉన్నాం. కీలక సమయంలో తప్పులు చేయడంతో వెనుకబడిపోయాం. యువ జట్టు తప్పులు చేయడం సహజమే. పొరపాట్ల నుంచి నేర్చుకుని మెరుగుపడతాం. తప్పకుండా పుంజుకుని సిరీస్ గెలుస్తాం. మ్యాచ్‌ మొత్తం మా ఆధీనంలోనే ఉన్నా.. వెంటవెంటనే వికెట్లు పడటంతో ఛేజింగ్ కష్టమైంది. ఓ రెండు భారీ షాట్లు ఆడి ఉంటే.. తప్పకుండా విజయం దక్కేది. టీ20 మ్యాచుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు’ అని అన్నాడు.

‘ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడానికి పిచ్‌ కారణం. ఇద్దరు మణికట్టు స్పిన్నర్లకు అవకాశం ఇవాలనుకున్నాం. అక్షర్ పటేల్‌ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో కీలకం. సరైన కాంబినేషన్‌తోనే మేం బరిలోకి దిగాం. పేసర్ ముకేశ్‌ కుమార్‌ రెండు వారాల్లో మూడు ఫార్మాట్లలోనూ అరంగేట్రం చేయడం బాగుంది. అద్భుతంగా రెండు ఓవర్లు బ్యాక్ టు బ్యాక్ బౌలింగ్ చేశాడు. జట్టుకు ఉపయోగపడాలని ఎప్పుడూ కోరుకుంటాడు. యువ ఆటగాడు తిలక్ వర్మ ఇన్నింగ్స్ ప్రారంభించిన తీరు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌ను రెండు సిక్సర్లతో ప్రారంభించడం గొప్ప విషయం. వీరంతా భవిష్యత్తులో భారత్‌ కోసం అద్భుతాలు చేస్తారనే నమ్మకం ఉంది’ అని హార్దిక్‌ పాండ్యా చెప్పుకొచ్చాడు.