ఒక్క పెద్ద విజయం ఏ ఆటగాడి కెరీర్ నైనా మార్చేస్తుంది. క్రికెట్ లో ఐపీఎల్ ద్వారా యువ ఆటగాళ్ళ లైఫ్ మారిపోతుంటే… ఇతర క్రీడల్లో మాత్రం ఒలింపిక్ స్థాయిలో సత్తా చాటితేనే సాధ్యమవుతుంది. ఈ క్రమంలో ఎన్నో కష్టాలు, సవాళ్ళు దాటి విశ్వక్రీడల్లో మెడల్ గెలిచే ప్రతీ క్రీడాకారుడూ సెలబ్రిటీగా మారిపోతారు. టోక్యో ఒలింపిక్స్ కు ముందు నీరజ్ చోప్రా గురించి పెద్దగా ఎవరికీ తెలీదు. పలు అంతర్జాతీయ పోటీల్లో మెడల్స్ గెలిచినా టోక్యోలో స్వర్ణం సాధించిన తర్వాతే నేషనల్ హీరోగా మారిపోయాడు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన అసాధారణ ప్రతిభతో ఒలింపిక్స్ లో స్వర్ణం గెలిచాడు. తాజాగా పారిస్ ఒలింపిక్స్ లోనూ మరోసారి మెరిసిన నీరజ్ ఈ సారి రజతం సాధించాడు.
నీరజ్ చోప్రా బ్రాండ్ వాల్యూ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. దేశంలో సక్సెస్ ఫుల్ అథ్లెట్ల జాబితాలో ఒకడిగా నిలిచిన నీరజ్ చోప్రా ప్రస్తుత నెట్ వర్త్ 37 కోట్ల పైమాటే…
మ్యాచ్ ఫీజులు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ద్వారా భారీగానే ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. మన దేశంలో క్రికెటర్ల ఆధిపత్యం మధ్య, నీరజ్ చోప్రా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకున్నాడు. గత మూడేళ్ళ కాలంలో అతనితో పలు వాణిజ్య సంస్థలు బాగానే ఒప్పందాలు చేసుకున్నాయి. నీరజ్ చోప్రా స్పోర్ట్స్ కిట్ బ్రాండ్ నైక్, స్పోర్ట్స్ డ్రింక్ బ్రాండ్ గాటోరేడ్, టాటా AIA లైఫ్ ఇన్సూరెన్స్, క్రెడిట్ కార్డ్ యాప్ క్రెడ్ వంటి అడ్వర్టైజింగ్ బ్రాండ్‌లకు ప్రచారకర్తగా ఉన్నాడు.
ఇలా అన్ని కంపెనీల ప్రకటనల ద్వారా నీరజ్ చోప్రా భారీగా సంపాదిస్తున్నాడు. స్విస్ లగ్జరీ వాచ్‌మేకర్ ఒమేగాకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఉన్న నీరజ్ ఈ డీల్‌తో అంతర్జాతీయ సెలబ్రిటీల సరసన చేరాడు. బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్‌తో పాటు ఎవరెడీ కంపెనీని ప్రమోట్ చేస్తున్నాడు. లిమ్కా, బైజుస్, జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్, బ్రిటానియా, మొబిల్ ఇండియా వంటి ఇతర టాప్ బ్రాండ్‌లతో కూడా నీరజ్ ఒప్పందం చేసుకున్నాడు. తాజాగా పారిస్ ఒలింపిక్స్ లో రజతం గెలవడం ద్వారా మరోసారి అతని బ్రాండ్ వాల్యూ మరింత పెరగనుంది.