Kohli vs Gambhir: కోహ్లీ-గంభీర్ వివాదం దేనికి? ఇద్దరి మధ్య అసలేం జరిగింది? నవీన్ ఉల్ హక్‌తో సమస్యేంటి?

గంభీర్-కోహ్లీ మధ్య చాలా కాలంగా విబేధాలున్నాయి. సీనియర్ ఆటగాడిగా గంభీర్ అనేకసార్లు కోహ్లీని విమర్శించాడు. పలుసార్లు భారత జట్టు వైఫల్యం చెందినప్పుడు కోహ్లీ తప్పిదాలుంటే గంభీర్ వాటిని ప్రస్తావించేవాడు. దీంతో ఇద్దరిమధ్య దూరం పెరిగింది.

Kohli vs Gambhir: విరాట్ కోహ్లీ-గౌతమ్ గంభీర్ మధ్య సోమవారం జరిగిన గొడవ ఇప్పుడు ఇండియన్ క్రికెట్‌లో చర్చనీయాంశం అయింది. కొంతకాలంగా ఇద్దరి మధ్యా విబేధాలున్నాయి. ఇద్దరిదీ వేర్వేరు స్థాయి. గంభీర్ ఎప్పుడో క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చేశాడు. రాజకీయాల్లోకి ప్రవేశించి, ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నాడు. మరోవైపు ఐపీఎల్‌లో లక్నో జెయింట్స్ జట్టుకు మెంటార్‌గా ఉంటున్నాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వదులుకుని భారత జట్టు సభ్యుడిగా కొనసాగుతున్నాడు. మరోవైపు ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఆడుతున్నాడు. గంభీర్-కోహ్లీ మధ్య చాలా కాలంగా విబేధాలున్నాయి. సీనియర్ ఆటగాడిగా గంభీర్ అనేకసార్లు కోహ్లీని విమర్శించాడు. పలుసార్లు భారత జట్టు వైఫల్యం చెందినప్పుడు కోహ్లీ తప్పిదాలుంటే గంభీర్ వాటిని ప్రస్తావించేవాడు. దీంతో ఇద్దరిమధ్య దూరం పెరిగింది. అది ఇటీవల పతాక స్థాయికి చేరింది. ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత ఈ విబేధాలు బయటపడ్డాయి.

ఇండియన్ క్రికెట్‌లో దూకుడుగా వ్యవహరించే ఆటగాడు విరాట్ కోహ్లీ. అతడిని ఎవరైనా రెచ్చగొడితే ధీటుగా బదులిస్తాడు. ఇప్పుడు ఈ వైఖరే తాజా గొడవకు కూడా దారితీసింది. ఈ ఐపీఎల్ సీజన్‌లో లక్నో-బెంగళూరు జట్లు రెండుసార్లు తలపడ్డాయి. బెంగళూరు వేదికగా జరిగిన మొదటి మ్యాచులో బెంగళూరు జట్టు ఓడిపోయింది. అది కూడా చివరి బంతికి ఒక్క పరుగు తేడాతో లక్నో చేతిలో బెంగళూరు ఓడిపోయింది. దీంతో లక్నో మెంటార్ అయిన గౌతమ్ గంభీర్ మైదానంలోకి వచ్చి, బెంగళూరు ఫ్యాన్స్‌ను నిశ్శబ్దంగా ఉండమంటూ వేలితో సైగ చేశాడు. ఇది అప్పట్లో సంచలనం సృష్టించింది. కోహ్లీ కోపానికి కారణమైంది. గంభీర్ చేసిన పనిపై విమర్శలొచ్చాయి. తాజాగా దీనికి బెంగళూరు జట్టు ఆటగాడు కోహ్లీ బదులు తీర్చుకున్నాడు. ఇరు జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచులో లక్నో ఓడిపోయింది. లక్నో ఓటమి పాలవ్వబోతుందని తెలిసిన కోహ్లీ మైదానంలో రెచ్చిపోయాడు. లక్నో వికెట్లు పడిన ప్రతిసారి కోహ్లీ గతంకంటే భిన్నంగా, అతిగా సంబరాలు చేసుకున్నాడు.

అప్పుడే కోహ్లీ దూకుడు ప్రవర్తన అర్థమైంది. ఆ తర్వాత లక్నో ఓడి, బెంగళూరు గెలిచిన తర్వాత కోహ్లీ మరింత దూకుడుగా సంబరాలు చేసుకున్నాడు. అంతేకాదు.. బెంగళూరు ఫ్యాన్స్‌కు సంబరాలు చేసుకోండి.. గట్టిగా అరవండి అన్నట్లు సైగ చేశాడు. ఇది కచ్చితంగా గౌతమ్ గంభీర్‌కు బదులిచ్చేందుకు చేసిన చర్య అని అందరికీ అర్థమవుతుంది. అయితే, సోమవారం నాడు ఇద్దరి మధ్య గొడవకు మరో కారణం కూడా ఉంది. మ్యాచ్ అనంతరం షేక్ హ్యాండ్స్ ఇచ్చుకునే సమయంలో కోహ్లీకి, లక్నో జట్టు సభ్యుడు నవీన్ ఉల్ హక్ మధ్య ఏదో విషయంపై వాగ్వాదం జరిగింది. ఇద్దరూ చేతులు విదిలించుకున్నారు. ఈ విషయంలో గౌతమ్ కలగజేసుకోవడం కూడా వివాదానికి కారణమైంది. ఇది కోహ్లీ-గంభీర్ మధ్య మరోసారి వివాదానికి దారి తీసింది. అలాగే కోహ్లీతో లక్నో ఆటగాడు కైల్ మేయర్స్ మాట్లాడుతుండగా గంభీర్.. కోహ్లీతో మాట్లాడొద్దంటూ అతడిని పక్కకు తీసుకెళ్లాడు. ఈ సమయంలో కోహ్లీ, గంభీర్ ఒకరిని ఒకరు విమర్శించుకున్నారు. తోటి ఆటగాళ్లు కేఎల్ రాహుల్, అమిత్ మిశ్రా వంటి ఆటగాళ్లు ఇద్దరినీ విడిపించి దూరం తీసుకెళ్లారు. తర్వాత కొద్ది దూరం వెళ్లినా తిరిగొచ్చి మళ్లీ తిట్టుకున్నారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న బీసీసీఐ గంభీర్, కోహ్లీ.. ఇద్దరికీ మ్యాచు ఫీచులో 100 శాతం కోత విధించింది.
నవీన్ అస్సలు తగ్గట్లేదుగా?
ఈ మ్యాచులో విరాట్ కోహ్లీ-నవీన్ ఉల్ హక్ (అఫ్గనిస్తాన్) మధ్య కూడా వివాదం నడిచింది. ఏం జరిగిందో తెలియదు కానీ ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకునే సమంయలో ఒకరిచే యిని ఒకరు దూరంగా విదిలించుకున్నారు. ఈ అంశంలోనే గంభీర్ కలగజేసుకున్నాడు. ఈ వివాదం ముగిసినప్పటికీ.. ఇప్పుడు కోహ్లీకి, నవీన్ ఉల్ హక్ మధ్య సోషల్ మీడియా వేదికగా వాగ్వాదం నడుస్తోంది. ఇద్దరూ ఒకరినొకరు పరోక్షంగా విమర్శించుకుంటూ పోస్టులు పెడుతున్నారు. “మనం వినేదంతా నిజం కాదు.. అభిప్రాయం మాత్రమే. మనం చూసేదంతా సత్యం కాదు.. ఒక కోణం మాత్రమే” అని కోహ్లీ పోస్ట్ చేశాడు. దీనికి నవీన్ ఉల్ హక్ కౌంటర్‌గా మరో పోస్టు పెట్టాడు. “నీకేం దక్కాలో అదే దక్కింది. ఎలా ఉండాలో అలాగే ఉంటుంది. అలాగే నడుస్తుంది” అంటూ కోహ్లీకి బదులుగా పోస్ట్ పెట్టాడు.