ODI Series: ఆస్ట్రేలియాతో వన్ డే సిరీస్ ఎప్పుడు? ఎక్కడ?

ఈ వన్డే సిరీస్ లో పరుగుల వరద పారే అవకాశం ఉంది. టెస్టు సిరీస్ మొత్తం బౌలర్ల డామినేషన్ జరగ్గా, వన్ డే సిరీస్ బ్యాటింగ్ విధ్వంసాలను అభిమానులకు చూపించనుంది.

  • Written By:
  • Publish Date - March 14, 2023 / 01:41 PM IST

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ ను కైవసం చేసుకున్న భారత్, ఇప్పుడు అదే జోష్ లో వన్ డే సిరీస్ కోసం సిద్ధమవుతోంది. టెస్టు సిరీస్ ను ఎలాగూ కోల్పోయాం ఇక వన్ డే సిరీస్ ను అయినా చేజిక్కించుకోవాలని విసిటింగ్ జట్టు వ్యూహాలు పన్నుతోంది. మూడు వన్ డెల్లో ఇరు జట్లు తాడో పేడో తేల్చుకోనున్నాయి.

మొదటి వన్ డే మ్యాచ్ 17 మార్చ్ న ముంబై వాంఖడే స్టేడియమ్ లో జరగనుంది, రెండో మ్యాచ్ వైజాగ్ లో, పంథొమ్మిదో తేదీన జరగనుంది. మూడో మేచ్ చెన్నై లోని చిదంబరం స్టేడియం లో జరుగుతుంది. మూడు మ్యాచులు కూడా మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు ప్రత్యక్ష ప్రసారానికి రానున్నాయి. వన్ డే సిరీస్ కోసం ఇరు జట్లలోనూ కొన్ని మార్పులు చేర్పులు జరగనున్నట్టు తెలుస్తోంది. ఇటీవల బ్యాటింగ్ తో సత్తా చాటిన వాషింగ్టన్ సుందర్ జట్టులోకి తిరిగి వచ్చేలా కనిపిస్తున్నాడు. ఇక గాయం కారణంగా నాలుగో టెస్టులో వైదొలగిన శ్రేయాస్ అయ్యర్, దాదాపుగా ఈ వన్ డే సిరీస్ కు దూరమైనట్టే. ఫామ్ లో లేని కె ఎల్ రాహుల్ ను తిరిగి జట్టులోకి తీసుకుంటారా, లేక ఇషాన్ కిషన్ లేదా శుబ్ మాన్ గిల్ లో ఎవరో ఒకరిని ఎంపిక చేస్తారా అనేది వేచి చూడాలి.

IPL రానున్న నేపథ్యంలో ఆటగాళ్లందరూ గాడిలో పడే ప్రయత్నమే చేయనున్నారు. ఇక ఆసీస్ జట్టులో ఆల్ రౌండర్స్ మాక్స్ వెల్, మిచెల్ మార్ష్, మార్కస్ స్టోఇనిస్ లు జట్టులో చేరనున్నారు. అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్ లో ఒక్కరికే ఛాన్స్ దొరికే అవకాశం ఉంది. ఈ వన్డే సిరీస్ లో పరుగుల వరద పారే అవకాశం ఉంది. టెస్టు సిరీస్ మొత్తం బౌలర్ల డామినేషన్ జరగ్గా, వన్ డే సిరీస్ బ్యాటింగ్ విధ్వంసాలను అభిమానులకు చూపించనుంది.