Sourav Ganguly: టీమిండియాకు నెం.4 బ్యాట్స్మన్ లేడని.. వచ్చే ఆసియాకప్, వరల్డ్ కప్లలో ఈ లోటు భారత జట్టుకు తీవ్ర ఇబ్బంది కలిగే అంశమంటూ ప్రస్తుతం క్రికెట్‌లో చర్చ నడుస్తోంది. ఈ చర్చపై టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించాడు. భారత జట్టుకు నెం.4 బ్యాటర్ లేరని ఎవరు చెప్పారంటూ ప్రశ్నించాడు. నాలుగో నెంబర్‌లో బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్నవారు ప్రస్తుతం భారత జట్టులో చాలా మంది ఉన్నారని స్పష్టం చేశాడు.
టీమిండియాలో నాలుగో స్థానంలో ఆడేందుకు శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, సంజూ శాంసన్, కేఎల్ రాహుల్ వంటి ఆటగాళ్లు ఉన్నారని సౌరవ్ గంగూలీ తెలిపాడు. నెంబర్ 4 స్థానానికి లెఫ్టాండర్‌గా తిలక్ వర్మ సరైన ఆప్షన్ అని చెప్పాడు. తిలక్ వర్మ ఫియర్‌లెస్ గేమ్ ఎలాంటి పరిస్థితులకైనా తగ్గట్లు ఆడటం జట్టుకు కలిసొస్తుందని అభిప్రాయపడ్డాడు. ఐర్లాండ్ సిరీస్ ద్వారా బుమ్రా రీఎంట్రీ ఇవ్వడం టీమిండియాకు కలిసొచ్చే అంశం అని గంగూలీ చెప్పుకొచ్చాడు. వెస్టిండీస్ సిరీస్‌లో అద్భుతంగా రాణించిన యువ బ్యాటర్ జైస్వాల్‌ను బ్యాకప్ ఓపెనర్‌గా జట్టులోకి తీసుకుంటే బెటర్ అని గంగూలీ అన్నాడు. జైస్వాల్ ప్రతిభ, నిర్భయమైన బ్యాటింగ్ జట్టుకు ఉపయోగపడుతుందని చెప్పాడు.
యువకులు, సీనియర్లతో కూడిన జట్టును ఎంపిక చేస్తే టీమ్ సమతూకంగా ఉంటుందన్నాడు. రాబోయే వరల్డ్ కప్‌లో విజేతగా టీమిండియాతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లకు అవకాశం ఉందని గంగూలీ జోస్యం చెప్పాడు.