Delhi Capitals: ఐపీఎల్-2023లో గురువారం ఢిల్లీ, కోల్‌కతా జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది. ఇరు జట్లకూ ఈ మ్యాచ్ చాలా కీలకం. ముఖ్యంగా వరుస పరాజయాలతో డీలా పడిన ఢిల్లీకి ఈ మ్యాచ్ గెలవడం చాలా ముఖ్యం. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఓడిపోయింది. అయితే వారి కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఇప్పటికీ తమ స్క్వాడ్ మీద ఆశాజనకంగానే ఉన్నాడు.
చివరగా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో జరిగిన మ్యాచులో ఓడిపోయిన తర్వాత కూడా అదే విశ్వాసాన్ని వార్నర్ చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఈ సీజన్లో అతిపెద్ద నిరాశగా మిగిలిపోయింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ మూడు అర్ధశతకాలు సాధించినా కూడా అతని స్ట్రైక్ రేట్ 116.92తో తక్కువగా ఉంది. ఓపెనింగ్ భాగస్వామి పృథ్వీ షా పేలవమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్‌లో అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 15. వార్నర్, షా కలిసి ఐదు మ్యాచ్‌ల్లో మొత్తం 104 పరుగులు మాత్రమే చేశారు. మరోవైపు కోల్‌కతా జట్టు కూడా మెరుగైన ప్రదర్శన చేయడం లేదు. ఇక ఓపెనర్లు అధ్వానమైన రికార్డును కలిగి ఉన్న ఏకైక జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్.
ఈ జట్టు మొదట్లో పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు కోల్పోయింది. ఒక దశలో ఒక్క సిక్స్ కూడా అందుకోలేకపోయింది. కానీ, ఇప్పుడు వెంకటేష్ అయ్యర్ వారి వైఫల్యాలను భర్తీ చేస్తున్నాడు. గతంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడి 104 పరుగుల ఇన్నింగ్స్ తరువాత, ఆండ్రూ రస్సెల్ చేసిన 21 పరుగులే వ్యక్తిగత అత్యధిక స్కోరు. మిగిలిన లైనప్ అంతా కూడా పెద్దగా ప్రభావం చూపలేక వెనుకబడిపోతున్నారు. ఈ సీజన్‌లో కోల్‌కతాకు వారి స్పిన్ బౌలింగ్ మాత్రమే కలిసి వస్తోంది. జట్టు కీలక విజయాల్లో వారిదే ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఫాస్ట్ బౌలింగ్ త్రయం లాకీ ఫెర్గూసన్, ఉమేష్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ గత కొన్ని మ్యాచుల్లో మాత్రమే పర్వాలేదనిపించారు. వీరు ముగ్గురూ కలిసి ఇప్పటివరకు తొమ్మిది వికెట్లు మాత్రమే తీశారు. ఈ సీజన్‌లో ఒక జట్టు ఫాస్ట్ బౌలర్లకు సంబంధించి వీళ్లదే అతి తక్కువ స్టాట్స్‌గా కనబడుతున్నాయి. వీటన్నిటి దృష్ట్యా ఢిల్లీ తొలి గెలుపునకు ఇదే మంచి అవకాశంగా కనిపిస్తుంది.