Anjum Chopra: అందుకోసమే వాళ్లకు రెస్ట్: అంజుమ్ చోప్రా

వాళ్లేం ఇంటికెళ్లి పడుకుంటారా..? మ్యాచ్ ఉంటే సిటీ నుంచి సిటీకి ప్రయాణించాలి. క్రికెట్ టీం వాతావరణంలో ట్రైనింగ్ తీసుకోవాలి. ఇప్పుడు ఇంటికెళ్లి వాళ్లకు కన్వీనియెంట్‌గా ఉండే ట్రైనింగ్ చేసుకుంటారు. ఉదయాన్నే త్వరగా లేచి, విమానం ఎక్కి, ప్రాక్టీస్ చేసి మ్యాచ్ ఆడే రొటీన్ నుంచి ప్లేయర్లకు విశ్రాంతి కావాలి.

  • Written By:
  • Publish Date - September 24, 2023 / 03:03 PM IST

Anjum Chopra: ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీసులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇవ్వడంపై విమర్శలు వచ్చాయి. వీళ్లిద్దరూ వెస్టిండీస్‌తో వన్డే సిరీసులో ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడారు. ఆ తర్వాత ఆసియా కప్ ముందు నెలరోజుల రెస్ట్ తీసుకున్నారు. ఆసియా కప్‌లో ఆడిన ఆరు మ్యాచుల్లో ఒకటి వర్షార్పణమైంది. మిగతా ఐదింట్లో రెండు మ్యాచుల్లో 10 వికెట్ల తేడాతో టీం గెలిచింది. దీంతో కోహ్లీకి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. టోర్నీ ఫైనల్‌లో రోహిత్ కూడా బ్యాటింగ్ చేయలేదు.

అంతలోనే ఆసీస్‌లో సిరీసులో వీరికి విశ్రాంతి ఎందుకని ఫ్యాన్స్ నిలదీశారు. దీనికి భారత జట్టు మాజీ సారధి, లెజెండరీ క్రికెటర్ అంజుమ్ చోప్రా సమాధానం ఇచ్చారు. ఈ ఇద్దరు స్టార్లు రిఫ్రెష్ అయి వరల్డ్ కప్‌ను మొదలు పెడతారని అంజుమ్ అన్నారు. ‘వాళ్లేం ఇంటికెళ్లి పడుకుంటారా..? మ్యాచ్ ఉంటే సిటీ నుంచి సిటీకి ప్రయాణించాలి. క్రికెట్ టీం వాతావరణంలో ట్రైనింగ్ తీసుకోవాలి. ఇప్పుడు ఇంటికెళ్లి వాళ్లకు కన్వీనియెంట్‌గా ఉండే ట్రైనింగ్ చేసుకుంటారు. ఉదయాన్నే త్వరగా లేచి, విమానం ఎక్కి, ప్రాక్టీస్ చేసి మ్యాచ్ ఆడే రొటీన్ నుంచి ప్లేయర్లకు విశ్రాంతి కావాలి. మ్యాచ్ ఆడితే ఎవరూ అలసిపోరు. కానీ ఈ రొటీన్ వల్ల అలసిపోతారు’ అని అంజుమ్ వివరించారు.

అలాగే కోహ్లీ, రోహిత్ ఇద్దరూ కూడా వన్డేల్లో 10 వేలపైగా పరుగులు చేసిన బ్యాటర్లని, ఒక రెండు మ్యాచులు ఆడకపోతే వాళ్ల ఆటతీరు చెడిపోదని ఆమె ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు, ఈ రెస్ట్ వల్ల వారిలో పరుగులు చేయాలనే ఆకలి పెరుగుతుందని ఆమె చెప్పారు. వరల్డ్ కప్‌లో హార్దిక్ పాండ్యా బెస్ట్ ఫామ్‌లో ఉండాలని, కాబట్టి అతనికి విశ్రాంతి ఇవ్వడం కూడా కరెక్టేనని ఆమె తెలిపారు.