ఒకప్పుడు జెంటిల్మన్ గేమ్‌లో అంతగా డబ్బు ఉండేది కాదు. కానీ గత 15 ఏళ్ల నుంచి క్రికెట్ కూడా క్యాష్ రిచ్ గేమ్‌లా మారిపోయింది. ముఖ్యంగా లీగ్‌ల ఆరంభంతో కాసుల వర్షం కురుస్తోంది. అటు బోర్డులతో పాటు ఇటు ప్లేయర్లు కూడా ధనార్జనలో దూసుకెళ్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహణతో భారత క్రికెట్ బోర్డు ప్రపంచ క్రికెట్లో అత్యంత ధనిక బోర్డుగా అవతరించింది. దీంతో పాటు క్రికెటింగ్ కంట్రీస్‌లో టీమిండియాకు ఉన్న ఫేమ్, మన స్టార్ ప్లేయర్లకు ఉన్న క్రేజ్ తదితరాలు కూడా బోర్డుకు కలిసొస్తున్నాయి. ప్రసార హక్కులు, స్పాన్సర్‌షిప్‌లతో ఆదాయ పరంగా బీసీసీఐ పంట పండుతోంది. అందుకే ఐసీసీలో మన బోర్డు హవా నడుస్తోంది. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ బోర్డులు కూడా పటిష్టమైన బోర్డులే. ధనార్జనతో పాటు ఈ మూడు జట్లు.. టెస్టులు, వన్డేలు, టీ20ల్లో టాప్ టీమ్స్‌గా ఉన్నాయి.
ఈమధ్య కాలంలో భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య ఎక్కువగా దైపాక్షిక సిరీస్‌లు జరుగుతున్నాయి. వీటికి ఆడియెన్స్ నుంచి ఆదరణ ఎక్కువగా ఉండటంతో బోర్డులు వరుస సిరీస్‌లు నిర్వహిస్తున్నాయి. అయితే ఇది చాలా తప్పు అని వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ క్రిస్ గేల్ అన్నాడు. ఇండియా, ఇంగ్లండ్, ఆసీస్ కలసి క్రికెట్‌ను నాశనం చేస్తున్నాయని అతడు విమర్శించాడు. గత కొన్నేళ్లలో క్రికెట్ ఎంతగానో మారిపోయిందన్న గేల్.. ఇప్పుడు ఇదో బిజినెస్‌గా మారిందన్నాడు. టీ20 లీగ్‌లతో పాటు టెస్టుల్లోనూ చాలా డబ్బు వస్తుండటంతో చిన్న జట్ల కంటే పెద్ద దేశాలే ఎక్కువ ఆదాయం పొందుతున్నాయని చెప్పుకొచ్చాడు. భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలు ఎక్కువగా టెస్టులు ఆడుతున్నాయని.. ఈ మూడు జట్లే ఆధిపత్యం చెలాయించడం సరికాదన్నాడు గేల్. దీర్ఘకాలంలో ఇది క్రికెట్‌కు అస్సలు మంచిది కాదని హెచ్చరించాడు.