Sanju Samson: ఆసియా కప్‌లో భాగంగా శనివారం భారత్ వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య పోరు జరగనుంది. తొలి రెండు మ్యాచ్‌లకు కేఎల్ రాహుల్ అందుబాటులో ఉండటం లేదని, ఇప్పటికే ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ వెల్లడించాడు. దీంతో అతడి స్థానంలో సంజూ శాంసన్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా..? అని అభిమానుల మదిలో తలెత్తే ప్రశ్న. అయితే, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ జట్టుతోపాటు ఉన్నాడు.
తుది జట్టులోకి వచ్చే అవకాశం అతడికే ఎక్కువగా ఉందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో సీనియర్ అయిన సంజూ శాంసన్‌ను ఆడిస్తే బాగుంటుందనేది ఫ్యాన్స్ అభిప్రాయం. మరి నిబంధనలు ఏం చెబుతున్నాయనేది కీలకం కానుంది. ఆసియా కప్ కోసం ప్రకటించిన 17 మంది సభ్యుల జట్టులో సంజూ శాంసన్ లేడు. అతడిని స్టాండ్‌బై ప్లేయర్‌గానే రిజర్వ్ చేసి పెట్టారు. ఎవరైనా ప్లేయర్ టోర్నీ మొత్తానికి దూరమైతేనే అతడి స్థానంలోకి రిజర్వ్ ప్లేయర్‌ను తీసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది.
అయితే, కేఎల్ రాహుల్ తొలి రెండు మ్యాచ్‌లకే దూరంగా ఉంటాడని వెల్లడించిన నేపథ్యంలో.. స్టాండ్‌బై ప్లేయర్‌గా ఉన్న సంజూ శాంసన్‌కు తుది జట్టులోకి అవకాశం దక్కడం కష్టమేనని నిబంధనలు చెబుతున్నాయి. ఒక వేళ మ్యాచ్ జరిగే సమయానికి ముందే రాహుల్ టోర్నీకి దూరమవుతాడని వెల్లడిస్తే.. అప్పుడు సంజూ శాంసన్‌కు ఆడే అవకాశం లభిస్తుంది.