Virat Kohili: కోహ్లీకి కొత్త టెన్షన్ సెహ్వాగ్ మాటల్తో టీమిండియా అటెన్షన్

ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ 2023 జరగడానికి ఇవాళ్టికి సరిగ్గా వంద రోజులు మిగిలిఉంది. అంటే మూడునెలలకు పైగా సమయం ఉన్నా మెగా టోర్నీ అందునా నాలుగేళ్లకోసారి జరిగే సమరం కాబట్టి అంచనాలు భారీగా ఉంటాయి.

  • Written By:
  • Publish Date - June 27, 2023 / 06:36 PM IST

పైగా ఈసారి వన్డే వరల్డ్‌కప్‌కు క్రికెట్‌ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే మన దేశం ఆతిథ్యం ఇస్తుండడం వాటిని మరింత పెంచేసింది. దీనికి తోడు జూన్‌ 27న వన్డే వరల్డ్‌కప్‌ పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేయడం అభిమానుల సంతోషాన్ని మరింత రెట్టింపు చేసింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ డాషింగ్‌ ఆల్‌రౌండర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2011 వన్డే వరల్డ్‌కప్‌ను గెలిచి సచిన్‌ పాజీకి అంకితమిచ్చాం.. ఇప్పుడు 2023 వన్డే వరల్డ్‌కప్‌ కోహ్లి కోసం గెలవాలి. సచిన్‌ తర్వాత టీమిండియా క్రికెట్‌లో అనితరసాధ్య రికార్డులు సాధించిన కోహ్లికి బహుశా ఇదే చివరి ప్రపంచకప్‌ అయ్యే అవకాశం ఉంది. అతని కోసం టీమిండియా ఈసారి కప్పు కొట్టబోతుంది అంటూ తెలిపాడు.

స్టార్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో సెహ్వాగ్‌ మాట్లాడుతూ.. ”2011 వన్డే వరల్డ్‌కప్‌ మేము సచిన్‌ గెలుపు కోసం ఆడాం. వరల్డ్‌కప్‌ కొట్టి సచిన్ పాజీకి ఒక గ్రేట్‌ ముగింపునిచ్చాం. ఇప్పుడు కోహ్లి పరిస్థితి కూడా సచిన్‌నే తలపిస్తోంది. ఈసారి కోహ్లి కోసమైనా వరల్డ్‌కప్‌ కొట్టాలని ప్రతీ అభిమాని ఆశిస్తున్నాడు. కోహ్లి తన బ్యాటింగ్‌లో వందశాతం ఇచ్చేందుకు శాయాశక్తులా ప్రయత్నిస్తాడు. అలాగే ఈ వరల్డ్‌కప్‌ను గొప్పగా మలుచుకోవాలని చూస్తున్నాడు. లక్షలాది మంది అభిమానుల మధ్య అహ్మదాబాద్‌ వేదికగా టీమిండియా ఫైనల్‌ ఆడితే చూడాలని ఉంది. ఈసారి స్వంతగడ్డపై జరగడం టీమిండియాకు సానుకూలాంశం. ఇక కోహ్లికి టీమిండియా తమ మ్యాచ్‌లను ఏ మైదానంలో ఆడుతుందో వాటి పిచ్‌లపై కోహ్లికి పూర్తి అవగాహన వచ్చేసింది. ఈ నేపథ్యంలో కోహ్లి ఈసారి వరల్డ్‌కప్‌లో పరుగుల జడివాన సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.” అంటూ చెప్పుకొచ్చాడు.