Rohit Sharma: నేను ముందు ఆటగాన్ని.. ఆ తరవాతే నాయకుడిని: రోహిత్ శర్మ

అక్టోబరులో సొంతగడ్డపై మొదలయ్యే ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్‌లోనూ జట్టును నడిపించబోతున్నాడు రోహిత్‌ శర్మ. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా సన్నాహాలు, ఆటగాళ్ల గాయాలు, సెలెక్షన్‌ తదితర విషయాలపై రోహిత్‌ మీడియాతో మాట్లాడాడు.

  • Written By:
  • Publish Date - August 11, 2023 / 12:26 PM IST

Rohit Sharma: కెప్టెన్‌గా కంటే బ్యాటర్‌గానే భారత జట్టులో తన పాత్ర కీలకమని రోహిత్‌ శర్మ అన్నాడు. గత రెండేళ్లలో వివిధ ఫార్మాట్లలో సారథ్య బాధ్యతలు నిర్వర్తించిన అతను.. అక్టోబరులో సొంతగడ్డపై మొదలయ్యే ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్‌లోనూ జట్టును నడిపించబోతున్నాడు. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా సన్నాహాలు, ఆటగాళ్ల గాయాలు, సెలెక్షన్‌ తదితర విషయాలపై రోహిత్‌ మీడియాతో మాట్లాడాడు.

నా తొలి ప్రాధాన్యం బ్యాటింగ్‌కే. దాని తర్వాతే కెప్టెన్సీ. జట్టులో నా పాత్ర ప్రధానంగా బ్యాటర్‌గానే. ముందు భారీ స్కోర్లు సాధించి జట్టును గెలిపించడమే లక్ష్యం. దాంతో పాటు నాయకత్వ బాధ్యతలు కూడా సమర్ధంగా నిర్వర్తించాలి. ప్రపంచకప్‌లో జట్టును నడిపించడం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని శర్మ అన్నాడు. “నేనింత వరకు వన్డే ప్రపంచకప్‌ను అందుకోలేదు. అది నాకొక కల. దాని కోసం పోరాడటం నాకెంతో ఆనందాన్నిస్తుంది. ప్రపంచకప్‌ అంటే పళ్లెంలో తెచ్చి పెట్టి ఇవ్వరు. అందుకోసం చాలా కష్టపడాలి. 2011లో ప్రపంచకప్‌ గెలిచిన దగ్గర్నుంచి మా జట్టు మళ్లీ ఆ కప్పును మరోసారి అందుకునేందుకు శ్రమిస్తోంది. ప్రతి ఒక్కరూ ట్రోఫీ కోసం కసితో ఉన్నారు.

మాకు మంచి జట్టుంది. మేమందరం మెరుగైన ఆటగాళ్లం. ఇది సాధించగలమన్న ఆత్మవిశ్వాసం, నమ్మకం మాలో ఉన్నాయి” అని టీమిండియా రథసారథి అభిమానుల్లో ధీమాను పెంచాడు.