టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ సూపర్ ఫామ్ కొనసాగుతోంది. టెస్టుల్లో అరంగేట్రం చేసినప్పటినుంచి పరుగుల వరద పారిస్తున్న జైశ్వాల్ రికార్డుల మీద రికార్డులు అందుకుంటున్నాడు. తాజాగా కాన్పూర్ టెస్టులోనూ మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ఈ యువ క్రికెటర్లు పలు రికార్డులు సృష్టించాడు. బజ్ బాల్ కాన్సెప్ట్ తరహాలో ఆరంభం నుంచే భారీ షాట్లతో విరుచుకుపడిన జైశ్వాల్ కేవలం 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. తద్వారా టెస్టుల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన భారత ఓపెనర్ గా రికార్డులకెక్కాడు. తొలి ఇన్నింగ్స్ లో 71 రన్స్ చేసిన జైశ్వాల్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్అత్యధిక పరుగుల జాబితాలో రహానేను అధిగమించాడు. గతంలో రహానే 1159 రన్స్ చేయగా ఇప్పుడు యశస్వి దానిని బ్రేక్ చేశాడు.
ఇదిలా ఉంటే డబ్ల్యూటీసీ 2023-25 సీజన్ లో ఈ యువ ఓపెనర్ ఇప్పటి వరకూ 1166 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఈ జాబితాలో జో రూట్ 1398 పరుగులతో టాప్ ప్లేస్ లో ఉండగా…జైశ్వాల్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ సీజన్ లో ఇంకా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లపై ఆడనున్న జైశ్వాల్ రూట్ రికార్డును కూడా బ్రేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆసీస్ టూర్ లో ఈ యువ ఓపెనర్ ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. కాగా కాన్పూర్ టెస్టులో భారత్ ఆధిపత్యం కనబరుస్తోంది. రెండో ఇన్నింగ్స్ లో బంగ్లాను త్వరగా ఆలౌట్ చేసి మ్యాచ్ గెలిచేందుకు పట్టుదలగా ఉంది.