Dhoni vs Bhajji vs Gambhir: ధోనీ ఒక్కడే కప్‌ ఎలా గెలుస్తాడు? అదంతా పీఆర్‌ ట్రిక్కులు! యువరాజ్‌కి అన్యాయం! బాంబు పేల్చిన స్టార్‌ ప్లేయర్స్‌!

excerpt: టీమిండియా ఎప్పుడు ఓడిపోతుందా అని కొంతమంది గుంటనక్కల కాపు కాచుకొని ఉంటారు! ఇండియా ఓడిపోగానే సోషల్‌మీడియాలోకి వస్తారు.. 'మా ఫేవరెట్‌ కెప్టెన్‌ లేకపోతే టీమిండియా బతుకు బస్టాండే' అంటారు. అలాంటివాళ్లకి తగిన బుద్ధి చెప్పారు హర్భజన్ సింగ్‌, గంభీర్.

  • Written By:
  • Publish Date - June 13, 2023 / 08:52 AM IST

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోనీకి ఫ్యాన్స్‌ ఎంతమంది ఉంటారో.. హేటర్స్‌ కూడా అంతే ఉంటారు. ధోనీ ఫ్యాన్స్‌ అంతా ఒకవైపు ఉంటే సెహ్వాగ్‌, గంభీర్, యువరాజ్‌,గంగూలీ..ఇలా మిగిలిన సీనియర్ ఆటగాళ్ల ఫ్యాన్స్‌ మరోవైపు ఉంటారు. కొన్నిసార్లు ఫ్యాన్సే కాదు.. నేరుగా సెహ్వాగ్‌, గంభీర్‌ రంగంలోకి దిగుతారు..ధోనీపై..అతని అభిమానులపై విమర్శలు గుప్పిస్తారు. ఈ తతంగమంతా జరిగేది 2011 ప్రపంచ కప్‌ గురించి..! అసలు టీమిండియాను గెలిపించిందెవరన్న దానిపై ఈ వాదనలు జరుగుతుంటాయి.. మరోసారి అదే అంశం తెరపైకి వచ్చింది..!

WTC ఫైనల్‌ తర్వాత మొదలైన రచ్చ:
వరుసగా రెండోసారి కూడా టీమిండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌లో ఓడిపోయింది. అలా మ్యాచ్‌ పోయిందో లేదో.. ఇలా ధోనీ అభిమానులు ట్విట్టర్‌లో లాగిన్‌ అయ్యారు. ధోనీ లేకుండా కప్‌ గెలవలేరని తమ హీరోని ఆకాశానికి లేపుతూ మిగిలిన కెప్టెన్లు(రోహిత్,కోహ్లీ)పై వెటకారపు ట్వీట్లు మొదలుపెట్టారు. పనిలో పనిగా 2007టీ20 వరల్డ్ కప్, 2011వన్డే ప్రపంచ కప్‌లు గెలవడానికి ధోనీనే కారణమని.. అసలు గెలిచింది టీమిండియా కాదు అని.. ధోనీనే కప్‌ గెలిచాడని ట్వీట్లు పెట్టారు. దీంతో మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్‌కి ఒళ్లు మండింది.

భజ్జి కౌంటర్:
‘కోచ్ లేరు.. మెంటార్ లేరు.. ఇంతకు ముందు ఏ ఒక్క మ్యాచ్‌కి కెప్టెన్సీ చేయలేదు. అలాంటి వ్యక్తి సెమీఫైనల్స్‌లో బలమైన ఆస్ట్రేలియాను ఓడించాడు. కెప్టెన్ అయిన తర్వాత 48 రోజుల్లోనే దేశానికి టీ20 ప్రపంచ కప్‌ సాధించిపెట్టాడు..’ అని ధోనీ ఫ్యాన్ చేసిన ట్వీట్‌కి టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తనదైన స్టైల్‌లో రియాక్ట్ అయ్యాడు.’ఆ అవును, భారత్ తరుపున యువ ఆటగాడు ధోని ఒక్కడే అన్నిమ్యాచులు గెలిచాడు. మిగిలిన 10 మంది ఆడలేదు. ధోని ఒంటరిగా వరల్డ్ కప్ సాధించాడు. ఆస్ట్రేలియా అయినా.. మరే దేశమైనా వరల్డ్ కప్ గెలిస్తే, ఆ దేశం గెలిచిందని రాస్తారు. కానీ మన దేశంలోదేశానికి ఆపాదించరు. కెప్టెన్ ధోని గెలిచాడు, కెప్టెన్ రోహిత్ గెలిచాడు.. అంటూ కెప్టెన్లకు క్రెడిట్ ఇస్తారు. క్రికెట్ అనేది టీమ్ గేమ్. గెలిస్తే అందరు కలిసి గెలుస్తారు, ఓడితే అందరు కలిసి ఓడుతారు..’ అంటూ హర్భజన్ సింగ్ కౌంటరిచ్చాడు.

గంభీర్‌ దాడి:
ధోనీపై ఛాన్స్ దొరికినప్పుడల్లా విమర్శలు గుప్పించే గంభీర్‌ ఈ సారి మరింత ఘాటుగా కౌంటర్ ఇచ్చాడు. 2007, 2011 విజయాలు కేవలం ధోనీ వల్లే సాధ్యమైనట్లుగా అతడి పీఆర్ టీమ్ ప్రచారం చేసిందని, నిజానికి ఆ రెండింట్లోనూ యువరాజ్ దే కీలకపాత్ర అని గుర్తు చేశాడు. “నాకు కచ్చితంగా తెలియదు. కానీ 2007, 2011 వరల్డ్ కప్ ల గురించి మాట్లాడినప్పుడు దురద్రుష్టవశాత్తూ మనం యువరాజ్ పేరు మరచిపోతాం. ఇది కేవలం అంటే కేవలం మార్కెటింగ్, పీఆర్ టీమ్ మాత్రమే ఒక వ్యక్తిని మిగతా అందరి కంటే చాలా ఎక్కువగా చేసి చూపిస్తోంది. ఎవరూ తక్కువ కాదు. ఇదంతా పీఆర్, మార్కెటింగ్ మాయ. మనకు ఎవరు 2007, 2011 వరల్డ్ కప్ లు సాధించి పెట్టారో చెబుతూ వస్తున్నారు. కానీ అది ఆ ఒక్కడు కాదు మొత్తం టీమ్ వల్ల. ఏ ఒక్కరో అంత పెద్ద టోర్నీ గెలవలేరు. అలా అయితే ఇండియా ఇప్పటికే 5 నుంచి 10 వరల్డ్ కప్ లు గెలిచేదంటూ గంభీర్ వ్యాఖ్యలు చేశాడు.

ఇండియా వ్యక్తి పూజ దేశమని.. టీమ్‌ బాగా ఆడినా కూడా కేవలం వ్యక్తుల గురించే మాట్లాడుకుంటారని.. ఇది 2007, 2011 గురించి మాత్రమే కాదు అని.. 1983వరల్డ్ కప్‌ నుంచే ఇది మొదలైందన్నారు. 1983లో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించి.. సెమీఫైనల్, ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్న అమర్‌నాథ్ గురించి ఎవరూ మాట్లాడుకోరని.. కేవలం కపీల్‌దేవ్‌ని మాత్రమే పొగుడుతారని గంభీర్‌ చేసిన వ్యాఖ్యలను చాలా మంది సపోర్టు చేస్తున్నారు.. అప్పుడు అమర్‌నాథ్‌..తమ జనరేషన్‌లో యువరాజ్‌ అని గంభీర్‌ పోలిక నిజమైందేనంటున్నారు.

నిజమే కదా:
2011 ప్రపంచ్‌ కప్‌లో ధోనీ ఫైనల్‌లో అద్భుతంగా ఆడిన విషయం వాస్తవమే..అయితే అంతకముందు లీగ్‌ మ్యాచ్‌లు కీలకమైన క్వార్టర్స్‌, సెమీఫైనల్‌లో ధోనీ ఫ్లాప్‌ అయ్యాడు. ధోనీ చేసిన ఓకే ఒక హాఫ్‌ సెంచరీ ఫైనల్‌లో వచ్చింది. క్వార్టర్స్‌లో సచిన్‌,యువరాజ్‌ ఆస్ట్రేలియాపై గెలుపులో కీలక పాత్ర పోషించగా.. సెమీస్‌లో సచిన్‌,సెహ్వాగ్‌ మాత్రమే రాణించారు. క్వార్టర్స్‌లో యువరాజ్‌కి, సెమీస్‌లో పాక్‌పై సచిన్‌కి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించాయి. ఫైనల్‌లో యువరాజ్‌ కంటే ముందు ధోనీ తన బ్యాటింగ్ ఆర్డర్‌ని ప్రమోట్ చేసుకోని వచ్చాడు. ఓవరాల్‌గా చూసినా 2007, 2011 విజయాల్లో ప్రధాన పాత్ర యువరాజ్‌ సింగ్‌దే..కానీ అతని కంటే ధోనీకే పేరు వచ్చింది. ఇక రెండు ఫైనల్స్‌లోనూ గంభీర్‌ పాత్ర మరువలేనిది..అటు జహీర్‌ఖాన్‌ ఏం అన్యాయం చేశాడో ఎవరికీ అర్థంకాదు. 2011ప్రపంచ్‌ కప్‌లో 21వికెట్లు పడగొట్టిన జహీర్‌ఖాన్‌ ఆ టోర్నికే బెస్ట్ బౌలర్‌గా నిలిచాడు. ఫైనల్‌లో శ్రీలంకపై జహీర్‌ఖాన్‌ వేసిన తొలి ఐదు ఓవర్లలో 3మెయిడిన్లు ఉన్నాయి. కానీ జహీర్‌ఖాన్‌కి క్రెడిట్లు ఇచ్చేందుకు ఆఖరికి గంభీర్‌కి సైతం మనసు ఒప్పనట్టుంది. ఎందుకంటే బ్యాటింగ్ ఆడినోడే మనొళ్లకి హీరో.. జహీర్‌ఖాన్‌ బౌలర్‌ కదా పాపం!