వరల్డ్ కప్ సందడి ముగిసిన మళ్లీ మరో టీ ట్వంటీ సిరీస్ కు తెరలేవబోతోంది. ప్రపంచకప్ గెలిచిన టీమిండియా ఇంకా బార్బడోస్ లోనే ఉండగా.. జింబాబ్వేతో ఐదు టీ20ల సిరీస్ కోసం యువ జట్టు బయలుదేరింది. ఈ టూర్ కోసం సీనియర్ ప్లేయర్స్ అందరికీ బీసీసీఐ విశ్రాంతి ఇవ్వడంతో శుభ్‌మన్ గిల్ సారథ్యం వహించనుండగా.. వీవీఎస్ లక్ష్మణ్ కోచ్ గా వ్యవహరించనున్నాడు. వరల్డ్ కప్ గెలిచిన జట్టులో ఉన్న సంజూ శాంసన్, జైశ్వాల్ , శివమ్ దూబే కాస్త ఆలస్యంగా జట్టుతో పాటు చేరనున్నారు. మిగిలిన వాళ్లంతా కొత్త ఆటగాళ్లనే ఎంపిక చేశారు.
జింబాబ్వే బయలుదేరిన వాళ్లలో కోచ్ లక్ష్మణ్ తోపాటు అభిషేక్ శర్మ, ముకేశ్ కుమార్, రుతురాజ్ గైక్వాడ్, అవేష్ ఖాన్, రియాన్ పరాగ్ లాంటి ఐపీఎల్ స్టార్ ప్లేయర్స్ ఉన్నారు. సీనియర్ ప్లేయర్స్ ముగ్గురు రిటైరయిన వేళ యంగ్ ప్లేయర్స్ కు ఇది మంచి అవకాశం. ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్ కు కెప్టెన్ గా ఉన్న గిల్ తొలిసారి భారత జట్టుకు సారథ్య బాధ్యతలు అందుకోనున్నాడు. ఈ సిరీస్ లో యంగ్ ఇండియా ఐదు టీ ట్వంటీలు ఆడనుంది.