Yusuf Pathan: యూసఫ్ పఠాన్ విధ్వంసం 14 బంతుల్లోనే 61 రన్స్

టీమిండియా మాజీ ఆల్‌‌రౌండర్ యూసఫ్ పఠాన్ విధ్వంసం సృష్టించాడు. నాలుగు పదుల వయసులోనూ ఆకాశమే హద్దుగా చెలరేగి.. తనలో బ్యాటింగ్ చేసే సత్తా ఇంకా ఉందని చాటిచెప్పాడు.

  • Written By:
  • Publish Date - July 29, 2023 / 04:28 PM IST

సిక్స్‌ల వర్షం కురిపిస్తూ 14 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు. యూఏఈ క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలో జరుగుతున్న టీ10 లీగ్‌లో పఠాన్ ఈ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో జోబర్గ్ బఫ్పాలోస్ జట్టుకు ఊహించని విజయాన్ని అందించాడు. టీ10 లీగ్‌లో భాగంగా శుక్రవారం జోబర్గ్ బఫ్పాలోస్, డర్బన్ ఖలాండర్స్ జట్ల మధ్య క్వాలిఫయర్ 1 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన డర్బన్ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. 141 పరుగుల లక్ష్య చేధనలో జోబర్గ్ బఫ్పాలోస్ జట్టు 57 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఈ సమయంలో జోబర్గ్ టీమ్‌ను యూసఫ్ పఠాన్ ఆదుకున్నాడు. అయితే యూసఫ్ పఠాన్ సిక్స్‌ల వర్షం కురిపిస్తూ 14 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు. పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్ బౌలింగ్‌ను యూసఫ్ పఠాన్ ఓ ఆటాడుకున్నాడు. అమీర్ వేసిన 6 బంతులను 6,6,0,6,2,4 బాది.. ఏకంగా 24 పరుగులు పిండుకున్నాడు. ఆ తర్వాతి ఓవర్లోనూ విరుచుకుపడ్డాడు. పఠాన్ సునామీ ఇన్నింగ్స్‌తో జోబర్గ్ బఫ్పాలోస్ జట్టు 9.5 ఓవర్లలో 4 వికెట్లకు 142 పరుగులు చేసి గెలుపొందింది. యూసఫ్ తన ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 9 సిక్స్‌లు బాదడం విశేషం. మొత్తంగా 26 బంతుల్లో 80 రన్స్ చేశాడు.