టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ లో దుమ్మురేపుతున్నాడు. ఇంగ్లండ్ డొమెస్టిక్ వన్డే కప్ లో నార్తంప్టన్ షైర్ టీమ్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న చాహల్ తొలి మ్యాచ్ లోనే తన స్పిన్ మ్యాజిక్ తో అదరగొట్టేశాడు. కెంట్ తో జరిగిన మ్యాచ్ లో 5 వికెట్లతో సత్తాచాటాడు. చాహల్ ధాటికి కెంట్ బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. వచ్చిన వారు వచ్చినట్లే క్రీజ్ లో నిలబడలేక బ్యాట్లు ఎత్తేశారు. భారత బౌలర్ స్పిన్ కు కెంట్ టీమ్ 35.1 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలింది. చాహల్ 10 ఓవర్లలో కేవలం 14 రన్స్ మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. అందులో 5 ఓవర్లు మెయిడెన్స్ ఉన్నాయి. జాతీయ జట్టులో రీఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్న చాహల్ కౌంటీల్లో ఇదే జోరు కొనసాగిస్తే సెలక్టర్లకు తలనొప్పే.