ములుగు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క ఘన విజయం సాధించింది. తన గెలుపు తర్వాత సీతక్క ట్వీట్ ఏంటో తెలుసా.. 200 కోట్ల రూపాయల కేసీఆర్ డబ్బులు వర్సెస్ సీతక్క.. అవును.. ఈ నియోజకవర్గంలో సీతక్కను ఓడించడానికి బీఆర్ఎస్ 200 కోట్లు ఖర్చుపెట్టిందని ఆరోపణలు వచ్చాయి. ఆమెకు మావోయిస్ట్ పార్టీ నేపథ్యం ఉండటంతో… అలాంటి బ్యాక్ గ్రౌండే ఉన్న బడే నాగజ్యోతిని పోటికి పెట్టింది బీఆర్ఎస్. కానీ ములుగు జనం మళ్ళీ సీతక్కనే గెలిపించారు.
సీతక్క అంటే తెలియనివాళ్ళంటూ ఉండరు. ములుగు ఎమ్మెల్యేగా ఆమె చేసిన సేవలు సోషల్ మీడియాలో ఎప్పుడూ కనిపిస్తుంటాయి. కరోనా కాలంలో… వరదల టైమ్ లో నల్లమలలోని మారుమూల అటవీ ప్రాంతాల్లో తిరుగుతూ వారికి నిత్యావసరాలు, కూరగాయలు, డబ్బులు లాంటి సాయం చేశారు.. నిత్యం జనంలో తిరుగుతూ వారికి నేనున్నానని అండగా నిలబడింది సీతక్క. అయితే ఈ ఎన్నికల్లో సీతక్కను గట్టిగానే టార్గెట్ చేసింది బీఆర్ఎస్ అధిష్టానం. అందుక్కారణం… సీతక్క… రేవంత్ రెడ్డికి ఫాలోవర్ కావడమే. ఆమెను ఓడించడానికి మావోయిస్ట్ నేపథ్యం కలిగిన బడే నాగజ్యోతిని పోటీలోకి దింపి… ఆమె విజయం కోసం హరీష్ రావు తీవ్రంగా శ్రమించారు. పైగా ఒక్క ములుగు నియోజకవర్గానికే 200 కోట్ల రూపాయలను కేసీఆర్ ఖర్చుపెట్టినట్టు సీతక్క ఆరోపించారు. ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు… కార్యకర్తలను కొనుగోలు చేసి… వాళ్ళతో సీతక్కకు వ్యతిరేకంగా తప్పుడు ప్రకటనలు ఇప్పించారు. కుట్ర రాజకీయాలతో తనను ఓడించాలని బీఆర్ఎస్ తీవ్రంగా ప్రయత్నించిందని ఆరోపించారు సీతక్క.
సీతక్క ఈ ఎన్నికల్లో జనానికి డబ్బు పంచారో లేదో తెలియదు గానీ… జనం మాత్రం ఆమె సేవలను గుర్తించారు. ఎప్పుడో ఎన్నికలప్పుడు వచ్చి హడావిడి చేసే తత్వం ఆమెదు కాదని ములుగు నియోజకవర్గంలోని గిరిజనానికి తెలుసు. పెద్దల నుంచి పిల్లల దాకా తనను ములుగు ప్రజలంతా ఆదరించారనీ… అతన గెలుపు కోసం ఎంతో కష్టపడ్డారని అంటున్నారు సీతక్క. మొత్తానికి బీఆర్ఎస్ ఎన్నికుట్రలు చేసినా ములుగులో సీతక్క హ్యాట్రిక్ విజయం సాధించారు. రేపు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేసే అవకాశాలు ఉన్నాయి.