Amit Shah: రేపు తెలంగాణకు వస్తున్న అమిత్‌ షా.. పార్టీ పరిస్థితిపై చర్చిస్తారా..?

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా రేపు తెలంగాణకు రాబోతున్నారు. సూర్యాపేటలో జరిగే బహిరంగ సభలో అమిత్‌ షా పాల్గొంటారు. అనంతరం రాష్ట్ర ముఖ్య నేతలతో భేటీ కానున్నారు.

  • Written By:
  • Publish Date - October 25, 2023 / 04:09 PM IST

Amit Shah: కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి విషయంలో అంతా అనుకున్నదే జరిగింది. బుధవారం ఉదయం బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేసేందుకు రాజగోపాల్‌ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. తాను కోరుతున్న ఎల్బీ నగర్‌ సీటుతో పాటు గజ్వేల్‌ నుంచి కూడా పోటీ చేయాలనే ఆలోచనలో రాజగోపాల్‌ ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే విషయం ఇప్పటికే కాంగ్రెస్‌కు చెప్పేశారట ఆయన.

స్క్రీనింగ్‌ కమిటీ నిర్ణయం తరువాత ఈ విషయంలో కాంగ్రెస్‌ నుంచి రాజగోపాల్‌కు హామీ రానుంది. హైకమాండ్‌ ఓకే అంటే ఎల్బీనగర్‌తో పాటు సీఎం కేసీఆర్‌ మీద కూడా రాజగోపాల్‌ పోటీ చేయబోతున్నారు. ఇదిలా ఉంటే కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా రేపు తెలంగాణకు రాబోతున్నారు. సూర్యాపేటలో జరిగే బహిరంగ సభలో అమిత్‌ షా పాల్గొంటారు. అనంతరం రాష్ట్ర ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, అసంతృప్తుల వ్యవహారంపై ఈ భేటీలో చర్చించనున్నారు. పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్న నేతలతో అమిత్‌ షా మాట్లాడబోతున్నారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డితో అమిత్‌ షా మాట్లాడుతారా అనే ఆసక్తి నెలకొంది. ఇప్పటికే బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా చేశారు.

దీంతో ఆయనతో అమిత్‌షా మాట్లాడుతారా లేక వదిలేస్తారా అనేది సస్పెన్స్‌గా ఉంది. రాజగోపాల్‌ మాత్రమే కాకుండా మరికొందరు నేతలు కూడా పార్టీ మారేందుకు రెడీగా ఉన్నారు. వీళ్లను పార్టీ మారకుండా ఉండేందుకు అమిత్‌ షా ఎలాంటి ఆఫర్‌ ఇస్తారు అనేది ఆసక్తిగా మారింది.