Amit Shah: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. బీడీ కార్మికులు ఎక్కువగా ఉన్న నిజామాబాద్ ప్రాంతంలో ప్రత్యేక ఆస్పత్రి కట్టిస్తామని హామీ ఇచ్చారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. అలాగే కేసీఆర్ ప్రభుత్వం విధిస్తున్న సెస్, వ్యాట్ లాంటి పన్నులను తొలగించి ధరలను తగ్గిస్తామన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో బీజేపీ నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
BRS-BJP: రహస్య బంధం.. ఆ 20 సీట్లు బీఆర్ఎస్ గెలుస్తుందా..? బీజేపీతో రహస్యబంధం ఏంటో..!
“నిజామాబాద్‌లో పసుపు రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు ఏర్పాటు చేసింది. ఈ జిల్లాలో ఎక్కువగా ఉన్న బీడీ కార్మికుల కోసం నిజామాబాద్‌లో ప్రత్యేక హాస్పిటల్ కూడా కట్టిస్తాం. కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ కోసం వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. ప్రజలకు ఇచ్చిన ఏ హామీని కేసీఆర్ సర్కార్ నెరవేర్చలేదు. కేసీఆర్ పదేళ్లుగా తెలంగాణను నాశనం చేశారు. తెలంగాణలో ఆర్టీసీ స్థలాలను ప్రభుత్వం కబ్జా చేసింది. కేసీఆర్ కారు స్టీరింగ్ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేతిలో ఉంది. ఓవైసీకి, రజాకార్లకు భయపడి కేసీఆర్ తెలంగాణ విమోచన దినం జరపడం లేదు. బీజేపీ అధికారంలోకి రాగానే విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తాం. ప్రభుత్వ ఉద్యోగాల నియామకం కోసం పెట్టిన పరీక్షలు నిర్వహిచకుండా.. పేపర్ లీకేజ్‌ల పేరుతో యువతకు అన్యాయం చేశారు.
2014లో దళితుడ్ని సీఎంను చేస్తానని హామీ ఇచ్చి.. కేసీఆర్ మాట తప్పారు. కానీ, బీజేపీ బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తుంది. కేసీఆర్ తన టేబుల్‌పైన ఎవరు ఎక్కువ డబ్బులు పెడితే వాళ్లను మంత్రి వర్గంలోకి చేర్చుకుంటున్నారు. ఇక కేసీఆర్ టైం అయిపోయింది. అవినీతి కేసీఆర్‌ను అధికారం నుంచి దింపాల్సిన సమయం వచ్చింది. పదేళ్ల కాలంలో తెలంగాణలో కేసీఆర్ ఏ పనీ చేయలేదు. బీజేపీ అధికారంలోక వచ్చాక.. కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపి, ఆయన్ను జైలుకు పంపడం ఖాయం” అన్నారు అమిత్ షా.