TELANGANA BJP: 35 మంది అభ్యర్థులతో.. థర్డ్ లిస్ట్ రిలీజ్ చేసింది బీజేపీ. ఐతే ఇందులో చాలా సంచలనాలు కనిపించాయ్. కొత్త అధ్యక్షుడు, పాత అధ్యక్షుడు ఎవరూ తన ఫోన్‌కు రియాక్ట్ కావడం లేదని.. ఈసారి ఆందోల్ పోటీలో ఉండను అంటూ.. మీడియా మీట్ పెట్టి మరీ చెప్పిన బాబుమోహన్‌కు థర్డ్ లిస్ట్‌లో అవకాశం దక్కింది. ఇదే ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతోంది. బాబుమోహన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అుతున్నాయ్. పార్టీ పెద్దలపై బాబుమోహన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఫస్ట్ లిస్ట్‌లో తన పేరు ఎందుకు లేదో తనకు తెలియదంటూ తీవ్రంగా ఆవేదన చెందారు. మొదట్లో తన కుమారుడికి టికెట్ ఇస్తున్నట్లు ప్రచారం చేసి.. తనకు, తన కుమారుడికి ఇద్దరిలో ఒక్కరికీ కూడా టికెట్ ఇవ్వకపోగా సోషల్ మీడియాలో ఇద్దరిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ.. తనను, తన కొడుకును విడదీయాలని చూస్తున్నారని ఆరోపించారు. కట్ చేస్తే థర్డ్ లిస్ట్‌లో ఆందోల్ నుంచి బాబుమోహన్‌కే టికెట్ దక్కింది. అసలు ఆయన మీడియా ముందుకు ఎందుకు వచ్చారు.. వద్దని చెప్పినా ఆయనకు టికెట్ ఎందుకు ఇచ్చారు.. ఇలా రకరకాల ప్రశ్నలు వినిపిస్తున్నాయ్. బాబుమోహన్ మాటల వెనక బెదిరింపు ధోరణే కనిపించిందని.. బెదిరించి మరీ టికెట్ దక్కించుకున్న ఘనత బాబు మోహన్‌కే దక్కిందని ఇప్పుడు కొత్త చర్చ జరుగుతోంది. నిజానికి గత ఎన్నికల్లో ఆందోల్ నుంచి బీజేపీ తరఫున బాబుమోహన్ పోటీ చేశారు. కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. ఈ ఘోర పరాభవాన్ని దృష్టిలో పెట్టుకొని బాబుమోహన్‌కు ఈసారి టికెట్ దక్కడం దాదాపు అనుమానమే అనే చర్చ జరిగింది.
ఇక అటు జితేందర్ రెడ్డి తీరు అయితే ఈ చర్చకు మరింత ఆజ్యం పోసింది. బాబుమోహన్ కుమారుడిని ఈసారి బరిలోకి దింపితే బెటర్ అని జితేందర్ రెడ్డి అనడం.. ఆయన మాట చుట్టూ ప్రచారం జరగడం కొత్త చర్చకు కారణం అయింది. ఇలాంటి పరిణామాల మధ్య బాబుమోహన్ ప్రెస్‌మీట్ పెట్టారు. బీజేపీ పెద్దలపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు గుప్పించారు. టికెట్ రాకపోతే.. తర్వాత పరిణామాలు ఇంతకుమించి ఉంటాయ్ అన్నట్లుగా బాబుమోహన్ తీరు కనిపించిందనే అభిప్రాయాలు వినిపించాయ్. ఐతే ఇప్పుడు థర్డ్ లిస్ట్‌లో ఆయన పేరు ఉండడంతో.. బాబుమోహన్ అనుకున్నది సాధించారు అనే చర్చ జరుగుతోంది.