తెలంగాణ ముఖ్యమంత్రి వ్యక్తిగా రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం ఒంటి గంటా 4 నిమిషాలకు ప్రమాణం చేయబోతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించిన కొద్ది సేపటికే.. పార్టీ సీనియర్ నేత వేణుగోపాల్ రేవంత్ ను సీఎల్పీ నేతగా ఎన్నుకున్నట్టు ప్రకటించారు. ఢిల్లీలోనే ఉన్న రేవంత్.. ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ పెద్దలను ఆహ్వానించే పనిలో ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్ ఎల్.బి స్టేడియంలో కొత్త సీఎం ప్రమాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రి వ్యక్తిగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేయబోతున్నారు. గవర్నర్ తమిళిసై ఆయన చేత ప్రమాణం చేయిస్తారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంటా 4 నిమిషాలకు ఈ కార్యక్రమం జరగనుంది. కాంగ్రెస్ కృతజ్ఞతా సభ కోసం ఎల్బీ స్టేడియంలో ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీఎస్ శాంతి కుమారి, డీజీపీ రవి గుప్తా, సీపీ సందీప్ శాండిల్య తదితరులు ప్రమాణస్వీకార ఏర్పాట్లు, భద్రతను పర్యవేక్షించారు.
ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక, కేసీ వేణుగోపాల్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో పాటు ఏఐసీసీ నేతలు పాల్గొంటారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కేంద్ర మాజీ మంత్రులు, మాజీ సీఎంలను కూడా రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఢిల్లీలో సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గేతో సమావేశం అయ్యారు రేవంత్. మంత్రి వర్గంలో ఎవరెవరికి స్థానం కల్పించాలన్నదానిపైనా చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.
ఉదయం 10 గంటల 15 నిమిషాలకు ప్రమాణ స్వీకారం నిర్వహించాలని మొదట అనుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ కృతజ్ఞతా సభ కూడా ఉండటంతో.. బయటి ప్రాంతాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు రావడానికి వీలుగా ప్రోగ్రామ్ ను మధ్యాహ్నానానికి మార్చారు. అలాగే రేవంత్ కొడంగల్ ఎమ్మెల్యేగా గెలవడంతో.. మల్కాజ్ గిరి ఎంపీ పదవికి ఆయన రాజీనామా చేస్తున్నారు. స్పీకర్ ను కలిసి తన రాజీనామాను సమర్పించనున్నారు. మరో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం నాడే ఎంపీగా రిజైన్ చేశారు.