TPCC అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడానికి బలమైన కారణాలు ఉన్నాయి. పదేళ్ళుగా నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడంలో రేవంత్ ప్రయత్నాన్ని హైకమాండ్ గుర్తించింది. పైగా వచ్చే ఏడాదిలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో ఆర్థికంగా.. పార్టీ పరంగా ముందుకు తీసుకెళ్ళే సత్తా.. రేవంత్ కే ఉన్నట్టు గుర్తించింది. అందుకే రాహుల్ గాంధీ ఆయన పేరునే సూచించినట్టు తెలుస్తోంది.
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్కను ఖరారు చేసింది. గత రెండు రోజులుగా అధిష్టానం పెద్దలు హైదరాబాద్.. ఆ తర్వాత ఢిల్లీలో కసరత్తు చేశారు. ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడింది. ఈ సమయంలో అనూహ్యంగా గెలిచిన తెలంగాణలో సీఎం అభ్యర్థి ప్రకటన లేట్ చేయకూడదని భావించింది. అందుకే రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభంజనాన్ని తట్టుకొని.. కష్టపడి పార్టీని పైకి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి సేవలను గుర్తించింది AICC.ఖర్గే నివాసంలో రాహుల్ గాంధీ, వేణుగోపాల్ సమావేశం అరగంట పాటు కొనసాగింది. ఈ మీటింగ్ లో రాహుల్ గాంధీ మాత్రం రేవంత్ పేరునే సూచించినట్టు తెలిసింది.
JC Prabhakar : రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడే.. తెలంగాణకు రేవంత్ రెడ్డే సీఎం కావాలి..
కాంగ్రెస్ హైకమాండ్.. రేవంత్ రెడ్డి సీఎంగా ఎంపిక వెనుక చాలా బలమైన కారణాలు ఉన్నాయి. ఆయనకు జనంలో మంచి పాపులారిటీ ఉంది. మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర చేసినప్పటికీ.. రేవంత్ లాగా మాస్ లీడర్ కాదు. కేసీఆర్ ని ఢీకొన్ని గట్టి లీడర్ రేవంత్ మాత్రమే. పైగా గత పదేళ్ళల్లో కాంగ్రెస్ ను చావుదెబ్బ తీశారు కేసీఆర్. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి కాంగ్రెస్ పార్టీని కోలుకోకుండా చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి ప్రయత్నాలు మళ్ళీ చేసే దమ్ము కేసీఆర్ కు ఉండకపోవచ్చు. అందుక్కారణం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ప్రభంజనాన్ని తట్టుకొని కాంగ్రెస్ ను బలమైన పార్టీగా తీర్చిదిద్దడం ఒక్క రేవంత్ రెడ్డికే సాధ్యమైంది.
ఒకరకంగా చెప్పాలంటే దేశంలో కాంగ్రెస్ కు ఎదురుగాలి వీస్తోంది. మూడు రాష్ట్రాల్లోనూ ఈమధ్యే ఓడిపోయింది. అలాంటి టైమ్ లో తెలంగాణలో గెలవడం కాస్త ఊపిరి పీల్చుకున్నట్టు అయింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి ఇక్కడ కొన్ని ఎంపీ సీట్లయినా గెలవాలి. ఇండియా కూటమి సక్రమంగా పనిచేసి.. రాహుల్ గాంధీ పీఎం అభ్యర్థిగా ప్రొజెక్ట్ అయితే… తెలంగాణలో గెలిచే ఎంపీ సీట్లు కీలకం అవుతాయి. సార్వత్రిక ఎన్నికలకు టైమ్ కూడా చాలా దగ్గర్లో ఉంది. ఇంత కొద్ది టైమ్ లో కాంగ్రెస్ మళ్ళీ ఎన్నికలను ఎదుర్కోవాలి.. అందులో గెలవాలి అంటే అది రేవంత్ రెడ్డితోనే సాధ్యమని AICC నమ్మింది. అంతేకాదు.. ఈ సార్వత్రిక ఎన్నికలకు ఆర్థిక బలం కూడా అవసరం. అది రేవంత్ రెడ్డి వల్లే సాధ్యమవుతుందని భావించింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక.. ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్.. కేంద్రంలో ఉన్న బీజేపీ ఏదో ఒక రూపంలో అడ్డు తగులుతూనే ఉంటాయి. ఈ రెండు పార్టీలను ధీటుగా ఎదుర్కొనే సత్తా కూడా రేవంత్ కే ఉందని కాంగ్రెస్ అధిష్టానం నమ్మింది. మల్లు భట్టి విక్రమార్కకు ఈ సవాళ్ళను ఎదుర్కునే సామర్థ్యం లేకపోవడం వల్లే.. ఆయన్ని డిప్యూటీకి పరిమితం చేసినట్టు తెలుస్తోంది. రేవంత్ విషయంలో రాహుల్ గాంధీ ఖచ్చితమైన అభిప్రాయంతో ఉండటంతో.. ఖర్గే కూడా ఆమోదించాల్సి వచ్చింది. రేవంత్ పై వ్యతిరేకత కనబరిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డిని డీకే శివకుమార్ బుజ్జగించినట్టు తెలుస్తోంది.