రాష్ట్రం ఏర్పాటైన పదేళ్ల తర్వాత.. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ ఓటమికి కారణాలు ఏంటి.. కాంగ్రెస్‌ను ఆరు గ్యారంటీలే గెలిపించాయా అనే సంగతి పక్కన పెడితే.. ఫైనల్‌గా బీఆర్ఎస్ ఓడింది.. కాంగ్రెస్ గెలిచింది. ఓటర్లు ఎలాంటి కన్ఫ్యూజన్‌లో కనిపించలేదు. హస్తం పార్టీకి స్పష్టమైన మెజారిటీ అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇక ప్రగతి భవన్‌కు ప్రజా భవన్ అని పేరు మారుస్తామని చెప్పిన రేవంత్.. ఇకపై సీఎం అధికార నివాసం గేట్లు సామాన్యుల కోసం ఎప్పుడు తెరిచే ఉంటాయని ప్రకటించారు.
ఈటల రెండుచోట్ల ఓటమికి కారణం అదేనా ?
నిజానికి ప్రగతిభవన్ చుట్టూ ఎన్నికలకు ముందు.. అంతకంటే ముందు జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. అది ప్రగతి భవన్ కాదు.. దొరల గడీలా మారిందంటూ అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ విమర్శలు గుప్పించాయి. ఈ ప్రచారం జనాల్లోకి వెళ్లింది. బీఆర్ఎస్ ఓటమి వెనక ఇది కూడా ఒక కారణమా అంటే.. కాదు అనడానికి లేదు. ఇదంతా ఎలా ఉన్నా.. ఎన్నికల ఫలితాల తర్వాత గవర్నర్‌కు రాజీనామా లేఖ పంపించిన కేసీఆర్.. ప్రగతి భవన్‌ను వదిలేశారు. ఐతే అక్కడి నుంచి వెళ్లిపోయే ముందు కేసీఆర్ ఏం చేశారు.. ఎమోషనల్ అయ్యారా.. ఎవరితో మాట్లాడారు.. ప్రగతి భవన్ సిబ్బందికి బహుమతులు ఇచ్చారా.. అసలు ఆదివారం సాయంత్రం ఏం జరిగింది అనే చర్చ.. సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.
గవర్నర్‌కు రాజీనామా లేఖ పంపిన తర్వాత.. ఎంపీ సంతోష్ ను కేసీఆర్ ప్రగతిభవన్‌కు పిలిపించుకున్నారు. నీ కారు తీయ్.. ఎర్రవల్లికి వెళ్దాం అని సంతోష్‌తో కేసీఆర్ స్వయంగా చెప్పినట్లు తెలుస్తోంది. ఎంపీ సంతోష్ కారులోనే.. కేసీఆర్ సామాన్యుడిగా ప్రగతిభవన్ నుంచి ఫామ్‌హౌస్ వరకు వెళ్లారు. హైదరాబాద్ టు ఎర్రవల్లి.. ట్రాఫిక్ సిగ్నల్ పడిన ప్రతీచోట.. సామాన్యుడిలా కారు ఆపేసి.. ఎర్రవల్లి వెళ్లినట్లు తెలుస్తోంది. ఎర్రవల్లి ఫామ్‌హౌస్ వెళ్లాక కూడా.. పార్టీ ముఖ్యులు, కొందరు కుటుంబసభ్యులతో తప్ప.. పార్టీలో ఎవరితోనూ పెద్దగా మాట్లాడలేదని తెలుస్తోంది. ఏమైనా కేసీఆర్ అంటే చాంతాడంత కాన్వాయ్, ముందు వెనక సెక్యూరిటీ మాత్రమే తెలిసిన చాలామంది పార్టీ కార్యకర్తలకు.. ఆయన ఓ సామాన్యుడిగా ప్రగతిభవన్ నుంచి ఫాంహౌస్‌కు వెళ్లడం చూసి ఎమోషనల్ అయ్యారట.