BRS: తెలంగాణలో బీఆర్‌ఎస్ పరిస్థితి రోజు రోజుకూ క్లిష్టంగా మారుతోంది. ఓ పక్క నేతల అసంతృప్తి.. మరోపక్క బలంగా మారుతున్న ప్రతిపక్షం.. ఈ రెండింట మధ్యలో గెలుపుకోసం వ్యూహాలు రచిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ప్రస్తుత పరిస్థితిలో ప్రతీ సీటు బీఆర్‌ఎస్‌కు చాలా కీలకం. గత ఎన్నికలతో కంపేర్ చేస్తే ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయి. వివిధ పార్టీల కారణంగా భారీ మొత్తంలో ఓట్ బ్యాంక్ చీలిపోబోతోంది. ప్రతిపక్షాలకు కూడా పెద్దమొత్తంలో సీట్లు రాబోతున్నాయని పలు సర్వేలు చెప్తున్నాయి.
ఇలాంటి నేపథ్యంలో నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌కు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ నేతలు మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేశారు. భైంసా, బాసర జడ్పీటీసీలు.. ఓ ఎంపీపీ.. 10 మంది సర్పంచ్‌లు.. 8 మంది ఎంపీటీసీలు పార్టీకి రాజీనామా చేశారు. కొందరు సీనియర్ నాయకులతో పాటు 500 మంది కార్యకర్తలు కూడా పార్టీకి రాజీనామా చేశారు. స్థానిక ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కారణంగానే తాము పార్టీ వీడుతున్నట్టు రాజీనామా చేసిన నేతలు చెప్తున్నారు. పార్టీ కోసం కష్టపడ్డవాళ్లకు కాకుండా విఠల్ రెడ్డి తన వ్యక్తిగత మద్దతుదారులకు ప్రధాన్యత ఇస్తున్నాడంటూ ఆరోపించారు. ఇంత కాలం పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు ఇప్పుడు విఠల్ రెడ్డి కారణంగా బాధ పడుతున్నారంటూ చెప్పారు. విఠల్ రెడ్డి ఉన్న పార్టీలో తాము ఉండలేమంటూ పార్టీకి రాజీనామా చేశారు.
త్వరలోనే మీటింగ్ నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామంటూ చెప్పారు. వాళ్లంతా త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. ఒకే నియోజకవర్గంలో, ఒకేసారి ఈ స్థాయిలో నేతలు రాజీనామా చేయడం హాట్ టాపిక్‌గా మారింది. వీళ్లంతా ఇప్పుడు బీఆర్‌ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తే ఆ స్థానంలో బీఆర్‌ఎస్ గెలవడం ఇక కష్టమే. బీఆర్‌ఎస్ హై కమాండ్ ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.