Bitthiri Sathi: బీఆర్ఎస్‌లోకి బిత్తిరి సత్తి..? ప్రగతి భవన్‌లో కీలక భేటీ..!

బిత్తిరి సత్తిగా పేరు పొందిన చేవెళ్ల రవికుమార్‌.. ప్రగతి భవన్‌కు రావడం చర్చనీయాంశంగా మారింది. ముదిరాజ్‌ సామాజిక వర్గానికి చెందిన రవికుమార్‌ రీసెంట్‌గా ముదిరాజ్‌ గర్జన సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ టికెట్ల కేటాయింపులో బీఆర్‌ఎస్‌ పార్టీ ముదిరాజులకు అన్యాయం చేసిదంటూ గళం వినిపించారు.

  • Written By:
  • Updated On - October 26, 2023 / 05:06 PM IST

Bitthiri Sathi: ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ బీఆర్‌ఎస్‌ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈటెల రాజేందర్‌, నీలం మధు లాంటి వాళ్లతో దూరమైన ముదిరాజ్‌ ఓట్లను తిరిగి దక్కించుకునే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. రీసెంట్‌గానే అంబర్‌ పేట్‌ శంకర్‌ను బీఆర్‌ఎస్‌ పార్టీలోకి తీసుకుంది. ఇప్పుడు బిత్తిరి సత్తిగా పేరు పొందిన చేవెళ్ల రవికుమార్‌.. ప్రగతి భవన్‌కు రావడం చర్చనీయాంశంగా మారింది. ముదిరాజ్‌ సామాజిక వర్గానికి చెందిన రవికుమార్‌ రీసెంట్‌గా ముదిరాజ్‌ గర్జన సభలో కీలక వ్యాఖ్యలు చేశారు.

అసెంబ్లీ టికెట్ల కేటాయింపులో బీఆర్‌ఎస్‌ పార్టీ ముదిరాజులకు అన్యాయం చేసిదంటూ గళం వినిపించారు. మాకు కావాల్సింది కార్పొరేషన్‌ పదవులు కాదు ఎమ్మెల్యే పదవులు అంటూ స్ట్రాంగ్‌ స్పీచ్‌ ఇచ్చారు. ఇది జరిగిన కొన్ని రోజులకే ప్రగతి భవన్‌ నుంచి బిత్తిరిసత్తికి పిలుపు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. అక్కడ మంత్రి కేటీఆర్‌తో భేటీ అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ మీటింగ్‌ రాజకీయాలకు సంబంధించిందేనా లేదా అనే విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. కొన్ని రోజుల నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీ ముదిరాజుల మనసులు గెలుచుకోవడానికి ప్రయత్నిస్తోంది అనేది మాత్రం క్లియర్‌గా కనిపిస్తున్న సీన్‌. ఇందులో భాగంగానే బిత్తిరి సత్తిని పిలిపించారనే టాక్‌ నడుస్తోంది.

వీలైతే సత్తిని పార్టీలోకి ఆహ్వానించి కీలక బాధ్యతలు అప్పగించే చాన్స్‌ కూడా ఉందంటున్నారు. గతంలో బిత్తిరి సత్తి పాటలు కూడా పాడారు. ఈసారి బీఆర్‌ఎస్‌ ప్రచారంలో సత్తితో పాటలు పాడించబోతున్నారు అనే టాక్‌ కూడా నడుస్తోంది. ఓవరాల్‌గా ఈ మీటింగ్‌ తరువాత బిత్తిరి సత్తికి బీఆర్‌ఎస్‌ నుంచి గట్టి హామీ దొరికే చాన్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది.