తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు చూస్తుంటే అందరికంటే ఎక్కువగా బాధపడుతోంది మాత్రం బీజేపీ లీడర్లు, కార్యకర్తలే. మిగతా మూడు రాష్ట్రాల్లో అధికారం చేపడుతున్న బీజేపీ.. తెలంగాణను చేతులారా పోగొట్టుకుంది. విజయం దక్కే ఛాన్సున్నా.. చివరి నెలలో అధ్యక్ష స్థానంలో మార్పులు చేయడం, కవితను అరెస్ట్ చేయకుండా వదిలేయడం ఆ పార్టీని తెలంగాణలో కోలుకోలేని దెబ్బ తీశాయి.
నిజం చెప్పాలంటే.. బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టకు ముందు ఒక లెక్క.. చేపట్టిన తర్వాత మరో లెక్క అన్నట్టుగా ఉంది. సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక.. కమలాన్ని ఎక్కడికో తీసుకెళ్ళారు. ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల్లో దూకుడుగా వెళ్ళారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె దగ్గర నుంచి TSPSC లీకేజీ దాకా ఎన్నో ఆందోళనలను చేపట్టారు. స్వయంగా అరెస్ట్ అయ్యారు కూడా. కానీ రాష్ట్ర బీజేపీలో ఈటల రాజేందర్ పలుకుబడి తగ్గుతోందనీ.. సంజయ్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నాడని ఫిర్యాదులు అందాయి. దాంతో వెనుకా ముందు చూడకుండా బీజేపీ అధిష్టానం సంజయ్ ను అధ్యక్షుడిగా తప్పించింది. జనంలో ఫైర్ రగిల్చే నాయకుడుని తప్పించింది.
ఇక కవిత లిక్కర్ స్కామ్ ఎపిసోడ్ లో కూడా బీజేపీ బాగా బ్యాడ్ అయింది. ఈడీ అధికారులు పిలిచి విచారించడమే కానీ ఆమెను అరెస్ట్ చేయలేకపోయారు. అంతంతమాత్రం ఎవిడెన్స్ ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను జైలుకు పంపి.. కవితను ఎందుకు వదిలేశారన్నది ప్రశ్న. కేసీఆర్ ఢిల్లీలో చక్రం తిప్పారనీ.. అందుకే బీజేపీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం కవితను అరెస్ట్ చేయించలేకపోయిందనే టాక్ నడిచింది. అసలు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ను తప్పించడం వెనక కూడా కేసీఆర్ ఉన్నారన్న టాక్ నడిచింది. కేసఆర్ పై అగ్రెసివ్ గా వెళ్తున్నందునే అతన్ని పక్కనబెట్టారని జనం నమ్మారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య బంధం ఉందన్న కాంగ్రెస్ ఆరోపణలను జనం కన్ఫమ్ చేసుకున్నారు.
అధికారంలోకి వస్తే బీజేపీ అభ్యర్థిని సీఎం చేస్తామని పార్టీ అధిష్టానం చెప్పింది. కానీ బీసీ అయిన బండి సంజయ్ ను అధ్యక్షుడిగా తప్పించి.. బీసీ సీఎం చేస్తానంటే ఎలా నమ్ముతారని విమర్శలు వచ్చాయి. పోలింగ్ కి కొన్ని రోజుల ముందు ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాట ఇచ్చినా.. జనం బీజేపీని నమ్మలేదు. ఒక్క ఛాన్సివ్వండి.. మార్పు కావాలి అన్న కాంగ్రెస్ నే తెలంగాణ జనం నమ్మారు.
నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్ తో పాటు ఛత్తీస్ గఢ్ లోనూ కమలం పార్టీ దూసుకెళ్తోంది. ఈ టైమ్ లో తెలంగాణలో ఓడిపోవడం బీజేపీకి గట్టి దెబ్బ. ఇప్పటికే దక్షిణాదిలో కీలకమైన కర్ణాటకలోనూ ఓడింది. తెలంగాణలో గెలిచే అవకాశాన్ని చేతులారా నాశనం చేసుకుంది బీజేపీ. బండి సంజయ్ ఆధ్వర్యంలో ఎన్నికలకు వెళ్ళి ఉంటే పరిస్థితులు మరోలా ఉండేవని ఆ పార్టీ శ్రేణులు వర్రీ అవుతున్నాయి. ఈ వ్యూహాత్మక తప్పుకు ఎవరు పాల్పడ్డారని బీజేపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.