BANDI SANJAY: ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా.. ఒక్కటి మాత్రం నిజం.. తెలంగాణలో బీజేపీ ఈ మాత్రం జోష్‌లో ఉంది అంటే.. దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ బండి సంజయ్. విమర్శలు, ఆరోపణలు.. నడకలు, నడతలు.. కారణం ఏదైనా.. బీజేపీని రేసులో నిలబెట్టింది బండి సంజయ్ మాత్రమే! ఐతే ఏం జరిగిందో ఏమో తెలియదు.. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి బండిని తప్పించి ఆ పదవిలోకి కిషన్‌రెడ్డిని తీసుకువచ్చారు ఢిల్లీ పెద్దలు. అప్పటి నుంచి బీజేపీ మళ్లీ స్లో అవడం మొదలైంది.
ఇది గ్రహించారో.. తప్పు జరిగింది అని ఫీల్ అయ్యారో.. తెలీదు కానీ.. బీజేపీ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు హాట్‌టాపిక్ అవుతోంది. బండి సంజయ్‌కు కీలక బాధ్యతలు అప్పగించాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంది. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బండి సంజయ్‌కు కీలక బాధ్యతలు అప్పగిస్తోంది. తెలంగాణవ్యాప్తంగా బండి సంజయ్‌కు గట్టి పట్టు ఉండడం.. ప్రత్యర్థులపై పదునైన విమర్శలు చేయడంలో సంజయ్ దిట్ట కావడంతోనే.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఆయనతో ఎన్నికల ప్రచారం చేయించాలని బీజేపీ అగ్రనేతలు నిర్ణయించుకున్నారు. కేసీఆర్‌కు ధీటుగా మాట్లాడగలిగిన నేతగా సంజయ్‌ను బీజేపీ హైకమాండ్ గుర్తించింది. దీంతో సంజయ్ రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు వీలుగా.. ఆయనకు ప్రత్యేకంగా హెలికాఫ్టర్ కేటాయించింది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఆయన సేవలను వినియోగించుకునే విధంగా ఎన్నికల ప్రచారం చేసేందుకు అనువుగా హెలికాప్టర్‌ను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. సంజయ్‌తో పాటు, అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్ వంటి వారిని ఎన్నికల ప్రచారంలో భాగస్వామ్యం చేయాలని నిర్ణయించింది. బండి సంజయ్ ఈ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఒకవైపు తన అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేస్తూనే.. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా హెలికాప్టర్ ద్వారా నియోజకవర్గంలో పర్యటించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.