BJP: తెలంగాణలో బీజేపీ రెయిన్‌బో వ్యూహం.. కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌కు ఇక చుక్కలేనా..

మరో రెండు మూడు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించి.. ఆ వెంటనే మేనిఫెస్టో అనౌన్స్‌ చేసేందుకు బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌లను తలదన్నెలా మేనిఫెస్టో రూపకల్పన చేయాలని.. జనాల దృష్టి తమవైపు తిప్పుకోవాలని కమలనాథులు భావిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - October 16, 2023 / 07:17 PM IST

BJP: ఎన్నికల వేళ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తెలంగాణలో పార్టీలన్నీ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయ్. ఓవైపు అభ్యర్థుల ఎంపిక చేపడుతూనే.. మరోవైపు హామీలపై కీలక ప్రకటనలు చేస్తున్నాయ్. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ఫైనల్‌ చేసి మేనిఫెస్టోలు ప్రకటించాయ్. ఐతే బీజేపీ మాత్రం ఈ విషయంలో చాలా వెనకబడినట్లు కనిపిస్తోంది. అభ్యర్థుల ఎంపిక మీద, హామీల రూపకల్పన మీద.. కాషాయం పార్టీ ఇంకా కసరత్తు చేస్తూనే కనిపిస్తోంది. నేతల మధ్య విభేధాలు, వర్గపోరు, ఆధిపత్య పోరులాంటివి.. బీజేపీని ఈ మధ్య తెగ వేధిస్తున్నాయ్. వీటిని తగ్గించేందుకు జాతీయ స్థాయి నేతలు రంగంలోకి దిగినా.. పెద్దగా ఫలితాలు కనిపించడం లేదు.

దీంతో ఎన్నికల రేసులో కమలం పార్టీ వెనకే ఉండిపోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే.. ఎన్నికల పోరులో బీజేపీ మరింత బలహీనంగా మారే అవకాశం ఉంటుంది. దీంతో కమలం పార్టీ హైకమాండ్‌ కూడా అలర్ట్ అయింది. వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించి, ఎన్నికల హామీలను జనాల ముందు ఉంచాలని అధిష్టానం భావిస్తోంది. మరో రెండు మూడు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించి.. ఆ వెంటనే మేనిఫెస్టో అనౌన్స్‌ చేసేందుకు బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌లను తలదన్నెలా మేనిఫెస్టో రూపకల్పన చేయాలని.. జనాల దృష్టి తమవైపు తిప్పుకోవాలని కమలనాథులు భావిస్తున్నారు. ముఖ్యంగా మేనిఫెస్టోలో ఏడు హామీలను హైలైట్‌ చేయబోతున్నట్లు టాక్. అందుకే మేనిఫెస్టోకు రెయిన్‌బో.. అంటే ఇంధ్ర ధనుస్సు అని పేరు పెట్టాలని చూస్తున్నారట.

దీంతో బీజేపీ ఎలాంటి హామీలను ప్రకటించబోతోందనేది ఆసక్తికరంగా మారింది. ఐతే తమకు కావాల్సిన హామీలు కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ నుంచి దాదాపుగా వచ్చేశాయ్. బీజేపీ ఇప్పుడు హామీలు ఇచ్చినా.. ఆ రెండు పార్టీల మేనిఫెస్టోకు అటు ఇటుగానే ఉంటుంది తప్ప.. పెద్దగా సంచలనం క్రియేట్ చేసే అవకాశం లేదు. దీంతో జనాలు.. బీజేపీ మేనిఫెస్టో మీద పెద్దగా ఆసక్తి చూపించడం లేదు అనే చర్చ జరుగుతోంది.